Bison Review: బైసన్ మూవీ రివ్యూ
Published అక్టోబర్ 24, 2025 by Srinivas
బైసన్ మూవీ రివ్యూ
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైసన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. తమిళంలో గత వారం విడుదలైన ఈ మూవీ హిట్టు టాక్‌ను తెచ్చుకుంది. తెలుగులో అదే పేరుతో అక్టోబర్ 24న (నేడు) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? చియాన్ విక్రమ్ తనయుడు తెలుగులో హిట్టు అందుకున్నాడా? లేదా? అంటే?

కబడ్డీ ప్లేయర్ కిట్టయ్య….
కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ప్రాణం. కుల పట్టింపుల వల్ల సొంత ఊరి జట్టులో కిట్టయ్యకు చోటు దక్కదు. పీఈటీ టీచర్‌తో పాటు అక్క రాజీ (రాజీషా విజయన్) సహకారంతో ఆసియా గేమ్స్ ఆడే భారత జట్టులో చోటు సంపాదిస్తాడు. కిట్టయ్య తండ్రి వేలు సామి( పశుపతి)కి మాత్రం కొడుకు కబడ్డీ ఆడటం ఇష్టం ఉండదు. కబడ్డీ జోలికి వెళ్లకూడదని కొడుకుకు కండీషన్ పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనకంటే వయసులో పెద్దది అయినా రాణితో (అనుపమ పరమేశ్వరన్) కిట్టయ్య ప్రేమాయణం సాఫీగా సాగిందా? వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? పాండ్యరాజు, కందసామి మధ్య గొడవల మధ్య కిట్టయ్య ఎలా నలిగిపోయాడు? ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా జాతీయ జట్టులోకి వచ్చిన కిట్టయ్య తుది జట్టులో చోటు దక్కించుకున్నాడా? ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కిట్టయ్య జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే ఈ మూవీ కథ.

ఫిక్షనల్ బయోపిక్…
కుల వివక్ష, అణగారిన వర్గాల కష్టాలను, కన్నీళ్లకు స్టార్ వాల్యూ, ఇమేజ్‌ను జోడిస్తూ తమిళంలో సినిమాలు తెరకెక్కిస్తుంటారు మారి సెల్వరాజ్. బైసన్‌తో తనకు అచ్చొచ్చిన ఫార్ములాను ఫాలో అయ్యారు. సామాజిక అసమానలతకు కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. తమిళనాడుకు చెందిన కబడ్డీ ఆటగాడు మానతి గణేషన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ ఫిక్షనల్ బయోపిక్‌గా బైసన్ తెరకెక్కింది.
రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీస్‌కు భిన్నంగా…
గత సినిమాల్లో మాదిరిగా ఈ సారి కేవలం కుల వివక్ష అంశానికి మాత్రమే పరిమితం కాలేదు మారి సెల్వరాజ్. నేషనల్ టీమ్స్‌లో సెలెక్టర్ల నియంతృత్వ ధోరణి ఎలా ఉంటుంది? ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు రాకుండా ఎలాంటి అణగదొక్కుతారన్నది ఎమోషనల్‌గా చూపించారు.
కబడ్డీ ఆడాలనే తన కల నెరవేర్చుకోవడానికి ఇంటి నుంచి మైదానం వరకు హీరో అడుగడుగునా ఎన్ని అడ్డంకులు,అ వరోధాలు ఎదుర్కొన్నాడన్నది రా అండ్ రస్టిక్‌గా ఆవిష్కరించారు. రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీస్‌కు భిన్నంగా చాలా సీన్లు రియలిస్టిక్ ఫీల్‌ను కలిగిస్తాయి.

ఓ వైపు కుల వివక్ష…మరోవైపు కబడ్డీ ఆట, ప్రేమకథ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయడం అంటే కత్తిమీద సామే. కానీ సంక్లిష్టమైన కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ప్యారలాల్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో అన్ని ఎలిమెంట్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశాడు.
కుల గొడవలతో నిండిపోయిన ఓ ఊరు.. కబడ్డీ ఆటను ప్రాణంగా ప్రేమించే ఓ కుర్రాడు ధృవ్ విక్రమ్‌ను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా మొదలవుతుంది. ఆరంభం సన్నివేశాల్లోనే తన మార్కును చూపించాడుమారి సెల్వరాజ్. ఫస్ట్ హాఫ్‌లో కిట్టయ్యకు ఎదురైన సవాళ్ల ఉత్కంఠను పంచుతాయి. సెకండాఫ్ కబడ్డీ ఆటకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ థ్రిల్లింగ్‌గా సినిమాను సాగుతుంది. రిజర్వేషన్ అంశాన్ని ఎలాంటి వివాదాలకు తావులేకుండా సున్నితంగా చెప్పాడు. రిజర్వేషన్‌తో అవకాశాలను దక్కించుకున్నవాళ్లలో ప్రతిభావంతులు కాదంటూ చిన్నచూపు చూడొద్దనే సందేశాన్ని ఇచ్చారు.
కథ కొత్తదేం కాదు…
బైసన్ కథ కొత్తదేం కాదు. ఈ పాయింట్‌తో తెలుగుతో పాటు తమిళంలో చాలానే సినిమాలు వచ్చాయి. ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోనే బైసన్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఊహించేయచ్చు. స్టోరీ, స్క్రీన్‌ప్లే ప్రెడిక్టబుల్‌గా సాగుతాయి. కథ మొత్తం అక్కడే తిరుగుతూ ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. సినిమా నిండా తమిళ వాసనలే కనిపిస్తాయి. ఊరు, పేర్లు అన్ని తమిళంలోనే కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కొంత కష్టమే.

కిట్టయ్య పాత్రలో ధృవ్ విక్రమ్ నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా ఎంత వరకు కావాలో అంతే సెటిల్డ్‌గా నటించాడు. నటుడిగా ధృవ్ విక్రమ్‌ను ఈ సినిమా మరో మెట్టు ఎక్కించింది.
వేలు స్వామి పాత్రలో పశుపతి అదరగొట్టారు. చాలా చోట్ల హీరోను డామినేట్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ డీ గ్లామర్ క్యారెక్టర్‌లో మెప్పించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యతలేదు. రాజీషా విజయన్, లాల్, ఆమిర్‌తో పాటు మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. నివాస్ కే ప్రసన్న పాటలు, బీజీఎమ్ కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేశాయి.
తెలుగులో కష్టమే…
బైసన్ మంచి మెసేజ్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామా మూవీ. స్పీడ్ యుగంలో ఇలాంటి స్లోఫేజ్ మూవీని ఆడియెన్స్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారన్నది చూడాల్సిందే. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండటం కూడా తెలుగుకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారింది.
Rating: 



(2.75/5)
