వంద దేవుళ్లు మూవీ రివ్యూ
Published జూన్ 19, 2026 by Srinivas
తల్లీకొడుకుల కథ… ‘బిచ్చగాడు’ కథకు పూర్తి భిన్నంగానూ.. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ‘వంద దేవుళ్లు’ చిత్రం ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుందని ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ గట్టిగానే చెప్పారు. అసలే విజయ్ ఆంటోనికి తల్లి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది కాబట్టి ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగా పెరిగాయి. మరి తల్లీకొడుకుల కథ ప్రతి ఒక్క హృదయాన్ని తట్టిందా? ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుందా? చూద్దాం.

కథేంటంటే..
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వాసవి (స్వాసిక) తన కుమారులు భాస్కర్ (అజయ్ ధీశన్), వివేక్ (శక్తి రాజ్) ప్రాణంగా బతుకుతూ ఉంటుంది. పిల్లల్ని చదివించుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. దొరికిన పని చేసుకుంటూ పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ఆమెను తమ ఇంటి ముందున్న స్కూల్ టీచర్.. రెండో వివాహం చేసుకుంటారా? అని అడగ్గా తన పిల్లలు అంగీకరిస్తే చేసుకుంటానంటుంది. కానీ భాస్కర్ దానికి అంగీకరించడు. పైగా తల్లిపై కోపం పెంచుకుంటారు. కొద్ది రోజులకు సెట్ అవుతాడు. ఆ తరువాత ఆలోచించి తల్లికి వివాహం చేయాలనుకుంటాడు. అప్పుడు తల్లి అంగీకరించదు. కానీ అమ్మకు పెళ్లి చేసి కానీ తాను చేసుకోనంటూ భీష్మించిన కొడుకును చూసి వాసవి కూడా పెళ్లికి అంగీకరిస్తుంది. కానీ దీనికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి? వాటన్నింటినీ భాస్కర్ ఎలా అధిగమించాడు? ఈ చిత్రంలో ఏడుకొండలు (విజయ్ ఆంటోని) పాత్ర ఏమిటి? వాసవి పెళ్లిని అడ్డుకుంటున్న పెద్దిరెడ్డి (బాలాజీ శక్తివేల్) ఎవరు? వంటి అంశాలన్నీ వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..
ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అన్నీ కోల్పోయి.. ఎలాంటి సుఖసంతోషాలకు నోచుకోని తల్లికి ఒక తోడును బహుమతిగా ఇచ్చిన కొడుకుల కథే ఈ చిత్రం. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఎలాంటి ఆధారమూ లేక.. కనీసం ఆదరించే దిక్కు లేక ఒక సింగిల్ పేరెంట్ ఇద్దరు పిల్లల్ని పెంచడమనేది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ విషయాన్ని చిత్రంలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు దర్శకుడు శశి. ఫస్ట్ హాఫ్ అంతా తల్లి కొడుకుల కోసం పడే తపన.. ఒకానొక దశలో ఆమె వివాహం చేసుకోవాలనుకోవడం.. కొడుకు ఒప్పుకోకుంటే ఎంతో కష్టం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించడం వంటి అంశాలతో రూపొందించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను తల్లికి కొడుకు వివాహం చేయాలనుకోవడం వంటి అంశాలతో రూపొందించారు. అయితే విజయ్ ఆంటోని సెకండాఫ్ తర్వాత కానీ కనిపించరు. కేవలం తన మేనల్లుడు అజయ్ దీశన్ కోసమే ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా సినిమాను చక్కగా నడిపించారు. ముఖ్యంగా తల్లీకొడుకుల సెంటిమెంట్.. కొడుకులు తల్లికి వివాహం చేయాలనుకోవడం వంటి అంశాలను చక్కగా చూపించారు. సినిమా ఎండింగ్‌లో భావోద్వేగాలతో కట్టిపడేశారు. అనవసరమైన పాటలు కానీ.. ఫైట్‌లు కానీ లేవు. చాలా నేచురల్‌గా చిత్రాన్ని రూపొందించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీత లేకుంటే చిత్రం ఇంకా బాగుండేది.

ఎవరెలా చేశారంటే..
ముఖ్యంగా చెప్పుకోవల్సింది విజయ్ ఆంటోని గురించి. ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు చూడని పాత్రలో ఆయన మెస్మరైజ్ చేశారు. ఏడుకొండలు పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ఒక అమాయక రైతుగా చాలా ఆకట్టుకున్నారు. ఇక స్వాసిక సైతం పిల్లలే ప్రపంచంగా బతికే తల్లి పాత్రలో జీవించేసింది. పిల్లలతో లాస్ట్ భోజనం చేస్తున్నానంటూ ఆమె పలికించే భావోద్వేగాలు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. అజయ్ ధీశన్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. తల్లికి ఎలాగైనా వివాహం చేయాలని తపించే యువకుడిగా ఆకట్టుకున్నాడు. శక్తి రాజ్, కావ్య అనిల్, పదినీ కుమార్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
ఫైనల్‌గా.. ‘వంద దేవుళ్లు’ తల్లీకొడుకుల సెంటిమెంట్
Rating: 



(3/5)
