మరీచిక మూవీ రివ్యూ
Published మే 29, 2026 by Srinivas
రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మరీచిక’. ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ట్రైలర్ చూసిన వారికి సినిమా చూడాలనే ఆకాంక్ష తప్పక పుడుతుంది. ఎందుకంటే ఏదో జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ ఏం జరుగుతోందనేది అర్థం కాదు. అలాంటప్పుడు అసలు కథేంటో తెలుసుకోవాలన్న తపన ప్రేక్షకుడిలో తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్ వైపు నడిపించేలా ఉందా? తెలుసుకుందాం. సతీష్ కాసెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

కథేంటంటే..
కాలేజ్ స్టూడెంట్ అయిన వెంకట లక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) తన కాలేజీ దగ్గరలో కేఫ్ నడిపే సంజు… సంజయ్ (విరాజ్ అశ్విన్)ను ఇష్టపడుతుంది. కానీ తన మనసులో మాటను అతనికి చెప్పదు. ఒకరోజు వెంకటలక్ష్మికి ఎన్నారై మరీచిక పరిచయమవుతుంది. ఆమెను సంజూ కేఫ్‌కి వెంకటలక్ష్మి తీసుకెళుతుంది. మరీచికను చూసిన సంజయ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత మరీచిక కూడా అతడిని ఇష్టపడుతుంది. కొద్దిరోజులకే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లైన మర్నాడు మరీచికను సంజూ చంపేస్తాడు. అది చూసిన వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఆసక్తికరంగా సంజూ అసలు గాయాలనేవే లేకుండా వచ్చి మరీచిక ఎవరో తనకు తెలియదని చెబుతాడు. పోలీస్ స్టేషన్‌లో పిచ్చి పట్టినట్టుగా వెంకటలక్ష్మి ప్రవర్తిస్తూ ఉంటుంది. వెంటనే ఆమెను ఒక సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళతారు. ఆమెను పరీక్షించిన సైక్రియాటిస్ట్ ఏం చెబుతాడు? అసలు మరీచిక ఎవరు? వంటి చాలా ట్విస్ట్‌లను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమాకు ఆదరణ దక్కుతుంది. ఒకరకంగా ఈ సినిమా కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ కొంతమేర సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ తరువాత ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమైపోతూ ఉంటుంది. వాస్తవానికి సతీష్ కాసెట్టి రాసుకున్న కథ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది కానీ ప్రెజెంట్ చేయడంలో కాస్త తడబడినట్టుగా కనిపిస్తోంది. ట్విస్ట్‌లు గట్టిగానే పెట్టారు కానీ థ్రిల్ ఇచ్చేలా మాత్రం లేవు. ఇంటర్వెల్ వరకూ పాత్రల పరిచయం.. సంజయ్‌ను వెంకటలక్ష్మి ప్రేమించడం.. కానీ సంజయ్.. మరీచికను ప్రేమించి పెళ్లాడటం వంటి అంశాలతో కొనసాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటీ సెకండాఫ్ మీద కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆ తరువాత కథనే అంత ఆసక్తికరంగా సతీష్ నడిపించలేకపోయారు. మళ్లీ ఏం జరిగిందనేది సన్నివేశాలన్నీ రిపీట్ అవడం ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ ఘోష్‌ను పెట్టారు కానీ ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు అంతగా ఆకట్టుకోదు. మొత్తంగా మరీచిక పేరుకు తగ్గట్టుగానే ఉంది. మరీచిక అంటే ఎండమావి. ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు సైతం ఇంట్రస్టింగ్ పాయింట్ కోసం వెదుక్కోవాల్సిందే.
ఎవరెలా నటించారంటే..
మరీచికగా రెజీనా అద్భుతంగా నటించింది. తన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంది. విరాజ్ అశ్విన్ కూడా చక్కగా నటించారు. ఇక ఈ సినిమాలో కీలకమంటే అనుపమ పరమేశ్వరన్. టైటిల్ రోల్‌ను మించిన పాత్ర ఈమెది. అనుపమ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అయినా కూడా ప్రతి పాత్రలోనూ జీవించింది. ఇక ఇతర నటులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు సతీష్ కాసెట్టి ఆసక్తికరమైన కథ తీసుకున్నారు కానీ అంత ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. ఇక ఇళయరాజా అందించిన సంగీతం ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేకపోయింది. ఎక్కడా కూడా ఆయన ఆకట్టుకోలేకపోయారు. పాటలు కూడా ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కావు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కెమెరా పనితనం కూడా పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించి ఉండాల్సింది.
తీర్పు: అంతగా ఆకట్టుకోని ‘మరీచిక’
Rating: 



(1.75/5)
