లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 5, 2025 by Srinivas
లిటిల్ హార్ట్స్ (Little Hearts) రివ్యూ
’90s’ సిరీస్ మౌళి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ శివానీ జంటగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఓటీటీ కోసం తీసిన సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.
ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ’90s’ ద్వారా మౌళి పేరు తెచ్చుకున్నాడు. అతను హీరోగా ఆ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. వాస్తవానికి ఓటీటీ రిలీజ్ కోసం తీశారు. ప్రోడక్ట్ మీద నమ్మకంతో థియేటర్లకు తీసుకొచ్చింది ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. ‘బన్నీ’ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

కథ:
అఖిల్ (మౌళి) ఎంపీసీ స్టూడెంట్. ఎంసెట్‌లో క్వాలిఫై కాడు. లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేస్తాడు తండ్రి (రాజీవ్ కనకాల). బైపీసీ అమ్మాయి కాత్యాయనీ (శివానీ నాగరం) పరిచయమవుతుంది. ఇద్దరిలో ప్రేమ చిగురిస్తుంది. అమ్మాయి ఇంట్లో విషయం తెలుస్తుంది. కోచింగ్ సెంటర్ మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారు. లవర్‌ను కలవడం కోసం అఖిల్ ఎన్ని ప్రయత్నాలు చేశారు? చివరకు ప్రేమ గెలిచిందా? పెద్దల పట్టుదలకు తలొగ్గిందా? అనేది సినిమా.
విశ్లేషణ:
క్లైమాక్స్ అయ్యాక ‘మా సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ మీద ఒట్టే’ అన్నాడు హీరో. నిజానికి ఆ ప్లేసులో పడాల్సిన డైలాగ్ ‘ఒట్టేసి చెబుతున్నాం, మిమ్మల్ని నవ్విస్తాం’ అని. నవ్వించడం మీద దర్శకుడు సాయి మార్తాండ్ పెట్టిన దృష్టి మరొక అంశం మీద పెట్టలేదు. కథ, క్యారెక్టర్లు, క్లైమాక్స్ అంటూ చెప్పుకోవడానికి లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్నదంతా వినోదమే.

సింపుల్ స్టోరీతో ‘లిటిల్ హార్ట్స్’ తీశారు. సినిమాకు ప్లస్సు మైనస్సు అదొక్కటే. కథ కంటే కామెడీ మీద ఫుల్ కాన్సంట్రేషన్ చేశారు. ఇంటర్ చదువులు, ప్రేమలు, ఫెయిల్ అయితే వచ్చే పిల్లలకు వచ్చే పర్యవసానాలను వినోదాత్మకంగా చెప్పారు. ఇంటర్ చదివే పిల్లల ఆలోచనల్లో మెచ్యూరిటీ ఏముంటుంది? వాళ్ళంతే! వాళ్ళ జీవితాల్లో తొంగి చూడాలి తప్ప పెద్దోళ్ల కింద ప్రవర్తించాలని ఆశించకూడదు. ప్రతి సందర్భాన్ని నవ్వులతో నింపేశారు.
సాయి మార్తాండ్ రచనకు ఆర్టిస్టుల కామెడీ టైమింగ్ తోడు కావడంతో ఫన్ వర్కవుట్ అయ్యింది. మౌళికి టైలర్ మేడ్ రోల్ అఖిల్. ప్రతి సన్నివేశంలో జీవించాడు. శివానీ నాగరం క్యూట్ లుక్స్, ఇన్నోసెంట్ యాక్టింగ్ బావుంది. రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, సత్యకృష్ణన్, అనితా చౌదరి హీరో హీరోయిన్లకు సపోర్ట్ ఇచ్చాడు. హీరో ఫ్రెండ్ మధు పాత్రలో నటించిన అబ్బాయ్ కామెడీ టైమింగ్ బావుంది. హీరో హీరోయిన్స్ మీద వేసే సెటైర్లు నవ్వించాయ్. వీళ్ళ నవ్వులకు సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి సాంగ్స్, ఆర్ఆర్ బాగా హెల్ప్ అయ్యింది. ‘కాత్యాయనీ’ సాంగ్ ఇంకా నవ్వించింది.

తీర్పు:
సినిమా చూశాక గుర్తుండేది నవ్వులే. కథ, స్క్రీన్ ప్లే, మధ్యలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం నవ్వులకు తోడుగా నిలిచాయి. హాయిగా రెండు గంటలు కాలక్షేపం చేసే కామెడీ సినిమా ‘లిటిల్ హార్ట్స్’. 90s కిడ్స్‌కు వాళ్ళ ఇంటర్ డేస్ గుర్తు చేస్తుంది. బాగా కనెక్ట్ అవుతుంది.
ఒట్టేసి చెబుతున్నాం… నవ్వుతారు!
Rating: 



(2.75/5)
