Download App
Movie Poster

Nagabandham

Cast: Virat Karna, Nabha Natesh, Aishwarya Menon, Daksha Nagarkar, Mahesh Manjrekar, Jagapathi Babu, Murali Sharma

Director: Abhishek Nama

Music Director: Junaid Kumar, Abhi

Producer: Kishore Annapureddy, Nishitha Nagireddy

Release Date: July 3, 2026

నాగబంధం మూవీ రివ్యూ

Published జూలై 3, 2026 by Srinivas

అభిషేక్ నామా తెరకెక్కించిన ‘నాగబంధం’ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్.. గ్రాండియర్ లుక్.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ‘పెదకాపు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విరాట్‌ కర్ణ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందింది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా ఎలా ఉంది? ఒక విజువల్ వంజర్ అని చెప్పవచ్చా? చూద్దాం.

Nagabandham Movie Review

క‌థేంటంటే..

‘నాగబంధం’ ఒక పిరియాడిక్ మూవీ. ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ కథ సాగుతుంది. పురావ‌స్తు శాస్త్ర‌వేత్త ప్ర‌భాక‌ర్ (జ‌గ‌ప‌తిబాబు) ఆర్కియాలజిస్ట్. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రహస్యాలను ఛేదించినా కూడా నాగబంధం రహస్యాన్ని ఛేదించడంలో విఫలమవుతాడు. ఈ క్రమంలోనే ఆయన తన ఇద్దరు స్కాలర్లతో కలిసి హిమాలయాల్లో నాగ‌బంధం విముక్తికి సంబంధించిన ఓ ర‌హ‌స్య పుస్త‌కాన్ని కనుక్కుంటారు. ప్రభాకర్ దగ్గర ఉండే ఇద్దరు స్కాలర్లలో ఒకరైన టెస్లా ఆ పుస్త‌కాన్ని ప్ర‌భుత్వానికి అంద‌జేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, అబ్దాలీ మాత్రం దానిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాల‌నుకుంటాడు. ఈ క్రమంలోనే నాగ‌బంధం విముక్తికి శ్రీ రంగ‌నాథ స్వామి నాభిపై అలంక‌రించిన బ్ర‌హ్మ‌కమ‌లం కీల‌కమని తెలుసుకుంటాడు. దాన్ని చేజిక్కించుకుని బ్రహ్మాండాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు. దీనికి కాల‌వృక్షం బంధ‌నంలో ఉన్న భైరాగి (గ‌రుడ రామ్‌)తో క‌లిసి ప్లాన్‌ చేస్తాడు. దానిని సాధించడం కోసం అబ్దాలీ, భైరాగి కలిసి ఎన్నో అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌తారు. వీరి అరాచకాల్లో భాగంగా ఒక గూడెంలో జీవిస్తున్న రుద్ర (విరాట్‌క‌ర్ణ‌) కుటుంబం మొత్తాన్నీ అంతమవుతుంది. అసలు వాళ్లు రుద్ర కుటుంబాన్ని ఎందుకు అంతమొందించారు? ఆ తరువాత రుద్ర ఏం చేశాడు? 17వ శ‌తాబ్దంలోని నాగ‌సాధువు శివకీ, రుద్ర‌కీ మ‌ధ్య సంబంధం ఏమిటి? చివరకు ఆ రాక్ష‌సులు బ్ర‌హ్మ‌క‌మ‌లాన్ని చేజిక్కించుకున్నారా? అసలు ఈ చిత్రంలో పార్వ‌తి (న‌భా న‌టేశ్‌) పాత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాలన్నీ వెండితెరపై వీక్షించాల్సిందే.

Nagabandham Movie Review

ఎలా ఉందంటే…

పురాణాలు, స‌నాత‌న ధ‌ర్మం ఆధారంగా అభిషేక్ నామా ఒక కథను అయితే అల్లారు కానీ దానిని తెరకెక్కించే క్రమంలోనే పూర్తిగా తడబడ్డారు. విజువల్ హంగులు, లేనిపోని డాబు, దర్పం తన సినిమాలో చూపించాలన్న ఆతృత కథపై పెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేదేమో. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్‌లో ఉన్నంత గ్రాండియర్ సినిమాలో లేదనే చెప్పాలి. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రెండూ సెట్ కాకపోవడంతో ఎంత బడ్జెట్ పెట్టి రూపొందించినా.. విజువల్ హంగులు జోడించినా అంతా బూడిదలో పోసిన పన్నీరే. వాస్తవానికి ఒక మంచి పాయింట్‌నే దర్శకుడు ఎంచుకున్నాడు. పద్మనాభస్వామి ఆలయం, నాగబంధం అనేవి ఎప్పుడూ ప్రజలకు ఆసక్తికరమైనవే. కానీ ఈ సినిమా విషయంలో అభిషేక్ నామా నేల విడిచి సాము చేసినట్టుగా అనిపించింది. అంటే అసలు కథను గాలికి వదిలేసి.. అక్కర్లేని ట్రాక్‌లతో కథను సాగదీశారు. అసలు కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కనీసం కథతో ఏమాత్రం ఆయా పాత్రలకు సంబంధమే ఉండదు. బలవంతంగా ఇరికించేసినట్టుగా అనిపించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. హీరోతో హీరోయిన్ ప్రేమలో పడటం.. అలా కలవడంతోనే ఇలా ప్రేమ పుట్టడం.. సరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నా కూడా వెంటనే రొమాన్స్, పాటలు.. హంగామా. దీనికి కారణాన్ని తరువాత చూపించినా కూడా కన్విన్సింగ్‌గానే అనిపించదు. హీరోయిజం అంతా ప్రతి సారీ తనకు సంబంధించిన వాళ్లు చనిపోయాక మాత్రమే చూపిస్తూ ఉంటాడు. అదేదో ముందే తన హీరోయిజం చూపిస్తే వాళ్లను రక్షించుకోవచ్చు కదా అనిపిస్తుంది. ప్రతిదీ బలవంతంగా ఇరికించినట్టుగా అనిపిస్తుంది. కనీసం సనాతన ధర్మం వంటి అంశాలు కూడా ఎక్కవు. టోటల్‌గా ఫస్ట్‌ హాఫ్‌లో కథ అయితే లేదు. సెకండాఫ్ కూడా చాలా స్లోగా సాగుతుంది. సినిమా మొత్తమ్మీద అంతో ఇంతో ఆకట్టుకునే అంశాలేమైనా ఉన్నాయంటే.. హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, నాగబంధం రక్షణ వంటి సన్నివేశాలు మాత్రమే. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఫైనల్‌గా పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు.

Nagabandham Movie Review

ఎవరెలా చేశారంటే..

విరాట్ కర్ణ రుద్ర పాత్రలో పర్వాలేదనిపించాడు. రుద్రగా, సాధువుగా రెండు విభిన్నమైన పాత్రల్లో వేరియేషన్‌ బాగానే చూపించాడు. ఇక నభా నటేష్‌ పాత్ర సైతం చాలా బాగుంది. నభా కూడా ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది. విలన్‌గా రిషబ్‌ బాగా సెట్ అయ్యాడు. అద్భుతంగా నటించాడు. ఆర్కియాలజిస్ట్‌గా జగపతిబాబు అద్భుతంగా నటించారు. ఐశ్వర్య మీనన్ తన నటనతో ఆకట్టుకుంది. అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్‌గా..

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపించింది. సీజీ వర్క్ సెట్ అయ్యి ఉంటే సినిమా మరోలా ఉండేది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌ సెట్‌తో పాటు ప్రతీ సెట్‌‌ను చక్కగా తీర్చిదిద్దారు. మ్యూజిక్ పరంగా సినిమా బాగుంది. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. వీఎఫెక్స్‌ సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏఐని వాడటం పెద్ద మైనస్. ఎడిటింగ్‌ చాలా పేలవంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

హిందూ ధర్మం అంటే గతంలో జరిగిన అన్యాయాలనే మళ్లీ మళ్లీ చూపించడం అనే ధోరణి నుంచి ఫిల్మ్ మేకర్స్ బయటకు రావాలి. కథకు అవసరం ఉంటేనే సనాతన ధర్మం గొప్పతనాన్ని చూపించాలి. అవసరం లేకపోయినా “మేము హిందువలం” అంటూ పెద్ద పెద్ద డైలాగులు పెట్టడం మానేయాలి. సనాతన ధర్మం గొప్పతనాన్ని మీరు రాసుకునే fictional కథల్లో సహజంగా చూపించలేకపోతే, బలవంతంగా ఇరికించకండి.

ఫైనల్‌గా.. ‘నాగబంధం’ హంగులు తప్ప అన్నీ మైనస్సే..

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.