
పంచాయతీల ఆర్థిక పునరుజ్జీవనానికి పవన్ కళ్యాణ్ శంఖారావం పూరిస్తున్నారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి చేపల వేట మీద జీవనం సాగించే మత్స్యకారులు, దిగువ మధ్య తరగతి వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులు క్రమం తప్పకుండా పన్నులు కడుతున్నప్పుడు.. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలు, కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న పరిశ్రమలు పన్నులు ఎగవేస్తే ఎలా….?” అని మంగళగిరి లో పంచాయతీ రాజ్ శాఖ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
గ్రామమే దేశానికి పట్టుగొమ్మ. కానీ, ఆ పట్టుగొమ్మలు నేడు ఆర్థికంగా చితికిపోయి, కనీస అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణకు కూడా నిధులు లేక కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ దైన్య స్థితికి కారణం వనరులు లేకపోవడం కాదు.. వనరుల వసూళ్లలో ఉన్న అలసత్వం, ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలు, రాజకీయ ఒత్తిళ్లు. ఈ వ్యవస్థాగత జాడ్యాన్ని వేళ్లతో సహా పెకిలించివేయడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సాహసోపేతమైనవి, సమకాలీన సమాజానికి ఎంతో అవసరమైనవి.
సామాన్యుడి భారం – కార్పొరేట్ల నిర్లక్ష్యం
ఒక సామాన్య పౌరుడు లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి తాము సంపాదించే కొద్దిపాటి ఆదాయం నుంచే బాధ్యతాయుతంగా పన్నులు చెల్లిస్తున్నారు. కానీ, పంచాయతీలు కల్పించే రోడ్లు, నీరు, లైట్లు వంటి మౌలిక సదుపాయాలను నిరంతరాయంగా వాడుకుంటూ, టన్నుల కొద్దీ వ్యర్థాలను, కాలుష్యాన్ని గ్రామాల్లోకి వదులుతున్న కొన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మాత్రం పన్నుల చెల్లింపులో చేతులెత్తేయడం సామాజిక అన్యాయం. ఆంధ్ర పేపర్ మిల్స్ లాంటి పెద్ద సంస్థలు గోదావరిలోకి కాలుష్యాన్ని వదులుతూ, స్థానిక సంస్థలకు రూ. 13 కోట్ల పన్ను బకాయి పెట్టడం ఏ రకమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత….? రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల నుంచి రూ. 115.57 కోట్లు, విద్యాసంస్థల నుంచి రూ. 45 కోట్లు.. మొత్తంగా రూ. 160 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడం వెనుక ఉన్న నిర్లక్ష్యాన్ని “పవన్ కళ్యాణ్” తీవ్రంగా తప్పుపట్టారు.

నిర్మాణాల విలువను తగ్గించి చూపడం, రాజకీయ ఒత్తిళ్లతో పన్నులు ఎగవేయడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన కార్యాచరణ అభినందనీయం. పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నులపై తక్షణమే మరొకసారి నిర్ధారణ జరపాలని ఆదేశించారు. సంస్థల స్థాయిని బట్టి, వాటి పరిమాణాలను బట్టి నాలుగు గ్రేడ్ల స్లాబ్స్ టాక్స్ విధానాన్ని ప్రతిపాదించడం అభినందనీయం. కేవలం మాటలకే పరిమితం కాకుండా, వారం రోజుల్లో నివేదిక ఇచ్చేలా డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీని వేయడం ఆయన పనితీరులోని వేగానికి నిదర్శనం.
తాళ్లపాలెం, చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్ను వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై తక్షణ చర్యలకు ఆదేశించడం ద్వారా.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఉద్యోగులకు స్పష్టమైన హెచ్చరిక పంపారు. “ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి” అన్న ఆయన పిలుపు అధికారుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది.
ఆదాయ సృష్టి – స్వయం సమృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సృష్టించాలని చెబుతున్నారు. మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు, దానికి తగ్గట్టుగా ఆదాయాన్ని కూడా పెంచుకోవాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొనడం, రాష్ట్ర ఆర్థికస్థితి మీద ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. సరిగ్గా పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు సుమారు రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన లెక్కలతో సహా మీటింగ్ నిరూపించారు. ఈ నిధులు వస్తే గ్రామాల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు, పారిశుధ్యం, జీతాల సమస్యలు శాశ్వతంగా తీరిపోతాయి అని అన్నారు.

కేవలం పన్నుల వసూళ్లే కాకుండా.. ప్రతి పంచాయతీలో 2 వేల కలప ఇచ్చే మొక్కలు నాటడం ద్వారా అటవీశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం, బిల్ బోర్డులు, ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ ద్వారా స్వయం సమృద్ధి సాధించాలనే ప్రణాళిక గ్రామీణాభివృద్ధిలో ఒక విప్లవాత్మక అడుగు.
రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేము చూసుకుంటాం, మీరు నిర్భయంగా పన్నులు వసూలు చేయండి, ఎగవేసే వారి వివరాలు ప్రజలకు తెలియాలి” అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా క్షేత్రస్థాయి అధికారులకు కొండంత అండ. గత 30 ఏళ్లలో అన్యాక్రాంతమైన పంచాయతీ ఆస్తులపై నివేదిక కోరడం ద్వారా భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
ముగింపు: సామాన్యులను పీడించకుండా, రూ. 100 కోట్లు సంపాదించే పెద్దల నుంచి రావలసిన వాటాను రాబట్టాలనే “పవన్ కళ్యాణ్” సంకల్పం నెరవేరితే, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలు “ఆర్థిక స్వావలంబన” సాధించి, మహాత్మా గాంధీ కలలుగన్న నిజమైన “గ్రామ స్వరాజ్యం” వైపు అడుగులు వేయడం ఖాయం. ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” నిర్ణయానికి పాలకులే కాదు, ప్రజలందరూ ముక్తకంఠంతో మద్దతు పలకాల్సిన సమయం ఇది, దీనివలన రాష్ట్రం దేశంలోనే మార్గదర్శి గా నిలుస్తుంది
