
సరిహద్దులు భౌగోళికం కావచ్చు, కానీ సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగబద్ధం. పొరుగు దేశాల “అతి” జోక్యం స్నేహబంధానికి చేటు.. ఇది బంగ్లాదేశ్ కి ఎప్పటికీ తెలుస్తుందో…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం భారతదేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించినదిగా లేదు. ఈ ఎన్నికల ఫలితాలు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎంపీ అక్తర్ హుస్సేన్ ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చకు దారితీశాయి. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల ప్రజాప్రతినిధులు ఇంత బహిరంగంగా వ్యాఖ్యానించడం వెనుక ఉన్న ఆందోళనలు మరియు దాని పర్యవసానాలను మనం లోతుగా పరిశీలించాల్సి ఉంది.
బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నేత అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ, బెంగాల్‌లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకి వస్తే, అక్కడ నివసిస్తున్న బంగ్లాదేశ్ మూలాలున్న వారిని బలవంతంగా వెనక్కి పంపిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. “గెంటివేత” (Push-back) అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఆయన తన దేశ ప్రజల్లో మరియు సరిహద్దు అవతలి వైపు ఉన్న వారిలో భయాందోళనలురేకెత్తించే విధంగా ఉన్నాయి. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉంది.
భారతదేశంలో ఎన్నికలు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఏ విధానాలు అమలు కావాలి అనేది నిర్ణయించాల్సింది భారత ఓటర్లు మాత్రమే. ఒక స్వతంత్ర దేశంలోని ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా లేదా వాటిని విమర్శిస్తూ మరో దేశ పార్లమెంటులో చర్చలు జరపడం అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్ధం. “అక్తర్ హుస్సేన్” వ్యాఖ్యలు భారత్-బంగ్లాదేశ్ మధ్య గల సుహృద్భావ సంబంధాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.
ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన కారణం బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన అక్రమ వలసల అంశం. దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను అరికట్టడం, సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ చట్టాల పట్ల బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒక విధమైన అభద్రతా భావం ఉంది. అయితే, వీటిని అమలు చేయడం అనేది భారతదేశ అంతర్గత భద్రతా విధానంలో భాగమని భారత్ స్పష్టం చేస్తూనే ఉంది.
అక్తర్ హుస్సేన్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం, ఢాకాలోని భారత హైకమిషన్ ద్వారా తన నిరసన తెలిపినట్లు తెలుస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, పొరుగు దేశంలోని ఎన్నికల ఫలితాల గురించి ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య మతపరమైన లేదా ప్రాంతీయపరమైన చిచ్చు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అని చెప్పి తప్పుకున్నప్పటికీ, పార్లమెంటు వంటి అత్యున్నత వేదికపై ఇవి వెలువడటం దౌత్యపరంగా భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మే 4వ తేదీన తెలిసిపోతాయి. ప .బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఇప్పటికే అదనపు బలగాలను మోహరించింది. సరిహద్దు అవతలి నుండి అల్లర్లను ప్రోత్సహించే చర్యలు సాగకుండా నిఘా పెంచింది.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాలేదు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ మరియు సాంస్కృతిక రంగాల్లో రెండు దేశాలు విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాయి.
భారతదేశం ఎల్లప్పుడూ చట్టబద్ధమైన ప్రక్రియలను మాత్రమే అనుసరిస్తుంది. ఒకవేళ అక్రమ వలసదారుల గుర్తింపు జరిగినా, అది దౌత్యపరమైన చర్చలు మరియు అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే జరుగుతుంది తప్ప, అనాగరికంగా గెంటివేసే పద్ధతులు ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పొరుగు దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించడం ప్రతి దేశం యొక్క ప్రాథమిక బాధ్యత. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీర్పు ఏదైనప్పటికీ, అది భారతదేశ ప్రయోజనాలకు మరియు భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ఉంటుంది. బంగ్లాదేశ్ నేతలు తమ దేశ సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి, భారత ఎన్నికలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానితేనే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కలకాలం నిలుస్తాయి.
ముగింపు: తెలుగులో పెద్దవాళ్ళు ఒక మాట చెబుతుంటారు… “ఎవరి గుమ్మం ముందు చెత్త వారు ఊడ్చుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది” అని, బంగ్లాదేశ్ నేతలు భారతదేశ ఎన్నికల గురించి, మన దేశ విది, విధానాల గురించి మాట్లాడటం మానేసి, వారి దేశాభివృద్ధిపై దృష్టి పెడితే ఇరు దేశాలకూ శ్రేయస్కరం.
