
విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ , అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు… “ఇళయ దళపతి” విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ చెన్నైకి చెందినవారు. ఆమె శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్న గాయని. వీరిద్దరి నేపథ్యం సినిమా రంగం కావడంతో విజయ్‌కు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెరిగింది.
విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేవారు, కానీ ఆమె తన 2వ ఏటనే అనారోగ్యంతో మరణించారు. ఈ ఘటన విజయ్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతవరకు చాలా అల్లరిగా ఉండే విజయ్, చెల్లెలు మరణం తర్వాత చాలా నిశ్శబ్దంగా మారిపోయారు. తండ్రి దర్శకత్వంలోనే బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 18 ఏళ్ల వయసులో “నాళైయ తీర్పు” సినిమాతో కథానాయకుడిగా మారారు. ఈ చిత్రం పెద్దగా ప్రజాదరణ పొందలేదు. తరువాత వచ్చిన చిత్రం “సింధూర పాండి” ఈ చిత్రం హిట్ తో ఇక వెనుదిరిగి చూడలేదు విజయ్.
విజయ్ వివాహం 1999 ఆగస్టు 25న సంగీత తో జరిగింది. సంగీత విజయ్‌కు వీరాభిమాని, ఆమె లండన్ నుండి ఆయనను కలవడానికి చెన్నై వచ్చారు. వారి పరిచయం కాస్తా ఇష్టంగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు జేసిన్ సంజయ్ మరియు కుమార్తె దివ్య సాష. విజయ్ తన సినిమాల్లో ఎంత మాస్ ఇమేజ్ ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా హుందాగా, వివాదాలకు దూరంగా ఉంటారు.
విజయ్ కెరీర్ ప్రారంభంలో అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రూపం మరియు నటనపై విమర్శలు వచ్చాయి. అయితే, “పూవే ఉనక్కాగా” సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత “కాదలుక్కు మరియాదై”, “ఖుషీ” వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా, ‘గిల్లి’, ‘పోకిరి’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా ఎదిగారు. గత దశాబ్ద కాలంగా ఆయన సినిమాలు సామాజిక అంశాలను స్పృశించడం ప్రారంభించాయి. “మెర్సల్”, “సర్కార్”, “కత్తి” వంటి చిత్రాలు రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి, ఇది ఆయన రాజకీయ ప్రవేశానికి పునాది వేసింది.

2024 ఫిబ్రవరిలో విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం” (TVK) పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి, ప్రజా సేవకే అంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు. కేవలం పార్టీ పెట్టి వదిలేయకుండా, క్షేత్రస్థాయి లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆయన పార్టీ సిద్ధాంతం “మతం, కుల , అవినీతి, రహిత పాలన” పై ఆధారపడి ఉంటాయి అని చెప్పారు.
సాధారణంగా రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తారు. కానీ విజయ్ శైలి భిన్నంగా ఉంది. ఆయన “నిశ్శబ్ద ప్రచారం” (Silent Campaigning) అనే వ్యూహాన్ని అనుసరించారు. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకోవడంతో పాటు, తన అభిమాన సంఘాల (విజయ్ మక్కల్ ఇయక్కం) అభిమానులను బూత్ స్థాయి కార్యకర్తలుగా మార్చారు. విద్యార్థులకు అవార్డుల ప్రదానం చేయడం, నియోజకవర్గాల వారీగా మేధావులతో చర్చలు జరపడం ద్వారా నేరుగా ప్రజల హృదయాల్లోకి వెళ్లారు.
విజయ్ గెలుపు వెనుక బలమైన యువత మరియు మహిళా ఓటు బ్యాంకు ఉంది. దశాబ్దాలుగా DMK మరియు AIADMK పార్టీల మధ్య నలిగిపోతున్న తమిళ ప్రజలు ఒక “మార్పు” కోసం ఎదురుచూశారు. విజయ్ తన సినిమాల ద్వారా సంపాదించుకున్న “క్లీన్ ఇమేజ్” ఆయనకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత విజయ్‌ను ఒక నాయకుడికంటే తమ ఇంట్లో మనిషిగా భావించారు. ఆయన ప్రసంగాలు తక్కువైనా, చేసిన కొద్దిపాటి మాటలు ప్రజల మనస్సు లో బలంగా నాటుకున్నాయి.

విజయ్ రెండు చోట్ల పోటి చేశారు. అందులో ఒకటి “పెరంబూర్” (Perambur) ఈ నియోజకవర్గం లో విజయ్ రికార్డు స్థాయి మెజారిటీని సాధించారు. విజయ్ పొందిన ఓట్లు….1,20,365. ప్రత్యర్థి ఆర్.డి. శేఖర్ కు (DMK) వచ్చిన ఓట్లు… 66,650 కాగా, 53,715 మెజారిటీ ఓట్లు తో గెలుపొందారు. రెండవది తిరుచిరాపల్లి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గం ఇక్కడ కూడా విజయ్ సునాయాసంగా గెలుపొందారు. విజయ్ పొందిన ఓట్లు… 91,381 కాగా, ప్రత్యర్థి “ఇనిగో ఇరుదయరాజ్” కు వచ్చిన ( DMK) ఓట్లు… 63,965 వచ్చాయి. 27,416 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గతంలో జయలలిత వంటి అగ్ర నాయకులు అనుసరించిన వ్యూహాన్నే విజయ్ కూడా అనుసరించారు. ఉత్తర తమిళనాడు (చెన్నై) మరియు మధ్య తమిళనాడు (తిరుచి) రెండింటి పై పట్టు సాధించడానికి, తన పార్టీ శక్తి ని, రాష్ట్రవ్యాప్తంగా నిరూపించుకోవడానికి ఆయన రెండు చోట్లా పోటీ చేశారు.
గత 50 ఏళ్లుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి విజయ్ ఈ ఫలితాలతో గండి కొట్టారు. ముఖ్యంగా డీఎంకే అధినేత “ఎం.కె. స్టాలిన్” తన సొంత నియోజకవర్గమైన, “కొళత్తూరు”లో ఓటమి పాలుకావడం తమిళనాటనే, కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. “విజయ్” తన డ్రైవర్ కుమారుడు శబరినాథన్‌కు టికెట్ ఇచ్చి గెలిపించడం ద్వారా, రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం కంటే పనితనం ముఖ్యం అని నిరూపించారు.
