దృశ్యం 3 మూవీ రివ్యూ
Published మే 22, 2026 by Srinivas
మలయాళం సినిమాలంటేనే తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలా క్రేజ్ ఉంది. అందునా జీతూ జోసెఫ్ చిత్రాలకు మరింత క్రేజ్.. ఇక మలయాళీ చిత్రాల్లో ‘దృశ్యం’ సిరీస్‌లు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిపోయాయి. దృశ్యం రెండు పార్టులు అయితే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరి చడీ చప్పుడు లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టిన థర్డ్ పార్ట్ మాటేమిటి? రెండు పార్టులు మంచి సక్సెస్ సాధించడంతో అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ‘దృశ్యం 3’ అందుకుందా? చూద్దాం.

కథేంటంటే..
‘దృశ్యం 2’ను జీతూ జోసెఫ్ ఎక్కడైతే ముగించారో అక్కడి నుంచే తిరిగి మూడో పార్టును ప్రారంభించారు. వరుణ్ హత్య కేసును హైకోర్టు కొట్టేస్తుంది. దీంతో జార్జ్ (మోహన్‌లాల్) కుటుంబం రిలాక్స్ అవుతుంది. గతాన్ని మరచిపోయి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత కొంత కాలానికి జార్జ్ తమ జీవితంలో జరిగిన అంశాలను కాస్త అటు ఇటుగా మార్చి ‘దృశ్యం’ అనే టైటిల్‌తో సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంటాడు. మరోవైపు కూతురు అంజు (అన్సీబా హాసన్)కి పెళ్లి చేయాలని జార్జ్ దంపతులు భావిస్తారు. కానీ ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏ ఒక్కటీ పీటల వరకూ రాదు. అదేంటా అని ఆరా తీసిన జార్జ్‌కు కొందరు శత్రువులు తన కుమార్తె పెళ్లిని అడ్డుకుంటున్నారని.. ఆమెను జైలుకు పంపేందుకు స్కెచ్ వేస్తున్నారని తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ కుట్ర చేస్తున్నదెవరు? జార్జి తన కూతురును జైలుకు వెళ్లకుండా ఎలా కాపాడుకున్నాడు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి రావడానికి కారణమేంటి? వంటి అంశాలన్నీ వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
‘దృశ్యం’ కావొచ్చు.. ‘దృశ్యం 2’ కావొచ్చు.. రెండు ఒక చిన్న పాయింట్‌తో రూపొందినవే. కథను నడిపించిన తీరు, స్క్రీన్‌ప్లేతోనే అద్భుతమైన సక్సెస్‌ను ఆ రెండు సినిమాలూ సాధించాయి. కానీ ‘దృశ్యం 3’ అయితే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. దీనికి కారణం గత రెండు సిరీస్‌లలో ఉన్న పాత్రలు కానీ.. పేర్లు కానీ పార్ట్ 3లో లేకపోవడమే. మలయాళంలోని పేర్లనే కొనసాగించడంతో ఏ పాత్ర ఎలాంటిదనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు తెలుగు ప్రేక్షకుడికి కొంత సమయం పడుతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే టైటిల్ కార్డ్స్‌లోనే పార్ట్ 1, 2లకు సంబంధించిన కథను క్లుప్తంగా చెప్పేసి నేరుగా పార్ట్ 3లోకి జీతూ జోసెఫ్ తీసుకెళ్లారు. జార్జ్ కుటుంబం కేసు నుంచి బయటపడి ప్రశాంత జీవనం గడపడం.. సినిమా తీయడం వంటి అంశాలతో రూపొందించారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లో నెరేషన్ కావడంతో ప్రేక్షకుడికి విసుగు అనిపిస్తుంది. ఆ తరువాత అంజకి పెళ్లి సంబంధాలు చూడటం అంతా రిపీటెడ్‌గా కొనసాగడంతో ప్రేక్షకులు చాలా బోర్ ఫీలవుతారు. అయితే జార్జ్ ఎప్పుడైతే కూతురి పెళ్లి సంబంధాలను ఎవరో చెడగొడుతున్నారని అనుమానిస్తాడో అక్కడి నుంచి మాత్రమే కథలో వేగం పెరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో జార్జ్ కుటుంబాన్ని వెంటాడుతున్నది ఎవరనేది ఆసక్తికరం. శత్రువులంతా కలిసి రంగంలోకి దిగితే వారిని జార్జ్ సోలోగా ఎలా ఎదుర్కొన్నారనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా విషయానికి వస్తే ఎండింగ్ మినహా మిగిలినదంతా పెద్దగా ఆసక్తిని రేకెత్తించదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే ప్రేక్షకులకు పెద్ద బోరింగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఆకట్టుకుంటుంది. మొత్తానికి సినిమా హిట్ కొట్టడం అనేది కాస్త కష్టమే.

ఎవరెలా చేశారంటే?
మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? తన పాత్రలో జీవించేస్తారు. జార్జ్ పాత్రలో మోహన్‌లాల్ మరోసారి ఒదిగిపోయారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా సిద్ధపడే తండ్రిగా ఆయన నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. మీనా కూడా తన పాత్రను అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో చెప్పుకోవల్సింది.. సహదేవన్ పాత్ర పోషించిన కళాభవన్ షాజన్ గురించి. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఆయన అదరగొట్టేశారు. బిజూ మేనన్ కేమియో చేసి మెప్పించారు.
టెక్నికల్ పరంగా..
జీతూ జోసెఫ్ సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎందుకో ఆయన ‘దృశ్యం 3’ విషయంలో కాస్త తడబడ్డారు. ఎండింగ్ మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. నేపథ్య సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తీర్పు: ‘దృశ్యం 3’ చూస్తే కేవలం క్లైమాక్స్ కోసమే చూడాలి.
Rating: 



(2.25/5)
