Download App
Movie Poster

Kantara Chapter 1

Cast: Rishab Shetty, Rukmini Vasanth, Jayaram, Gulshan Devaiah, Pramod Shetty, Rakesh Poojari, Prakash Thuminad, Deepak Rai Panaje, Hariprasahnth MG, Shaneel Gautham, Naveen Bondel

Director: Rishab Shetty

Music Director: B Ajaneesh Loknath

Producer: Vijay Kiragandur, Chaluve Gowda

Banner: Hombale Films

Release Date: October 2, 2025

కాంతార ఛాప్టర్ 1 మూవీ రివ్యూ

Published అక్టోబర్ 2, 2025 by Srinivas

‘కాంతార ఛాప్టర్ 1’ రివ్యూ

‘కాంతార’తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార ఛాప్టర్‌ 1’తో థియేటర్లలో వచ్చారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.

రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. ఆయనకు జాతీయ పురస్కారం అందించిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. దసరాకు దేశవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో దర్శక రచయితగా రిషబ్ శెట్టి ఏం చూపించారు? ఎలాంటి సినిమా అందించారు? అనేది సమీక్షలో తెలుసుకోండి. 

'కాంతార ఛాప్టర్ 1' రివ్యూ

కథ:

కాంతారలోని ఈశ్వరుని పూదోట సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. అంతకు మించి అక్కడ బావిలో ఈశ్వరుని మహిమాన్విత శక్తులు ఉన్నాయి. అక్కడ దైవ రహస్యం తెలుసుకోవాలని కాంతారలో అడుగుపెట్టిన భాంగ్రా రాజు మరణిస్తాడు. కొన్నేళ్ల తర్వాత అతని మనవడు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య)కు పట్టాభిషేకం జరుగుతుంది. కాంతార అడవిలో వేటకు వెళతాడు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో భాంగ్రాలో కాంతార వాసులు బెర్మే (రిషబ్ శెట్టి), అతని బృందం అడుగు పెడతారు. సుగంధ ద్రవ్యాల వర్తకం మొదలు పెడతారు.

రాజకుమార్తె కనకవతి (రుక్మిణీ వసంత్)కు బెర్మే దగ్గర అవుతాడు. అది నచ్చని కులశేఖర్ కాంతరపై దండయాత్ర చేస్తాడు. తర్వాత ఏమైంది? కాంతారలో దైవ శక్తి కోసం కులశేఖర్ తండ్రి రాజశేఖర్ (జయరామ్) ఏం చేశాడు? ఈశ్వరుని పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏమిటి? కాంతార ప్రజలను అది ఎలా కాపాడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

కాంతార ఛాప్టర్ 1 రివ్యూ

విశ్లేషణ:

‘కాంతార’ విజయం రిషబ్ శెట్టికి జాతీయ పురస్కారం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వడమే కాదు… తన ఊహకు రెక్కలు తొడిగే నిర్మాణ వ్యయం సైతం అందించింది. దాంతో ‘కాంతార ఛాప్టర్ 1’ భారీ ఎత్తున తెరకెక్కింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు పాన్ ఇండియా సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కళ్ళు చెదిరే విజువల్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్సులతో సినిమా రూపొందింది.

Rukmini Vasanth in Kantara Chapter 1

‘కాంతార’కు ఆయువుపట్టుగా నిలిచింది పతాక సన్నివేశాలే. దైవిక శక్తి ఆవహించిన తరుణంలో రిషబ్ శెట్టి నటన పూనకాలు తెప్పించింది. ఇప్పుడీ ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాలోనూ పతాక సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ప్రేక్షకులకు తెలిసిన దైవిక శక్తి నేపథ్యంలో కొత్త కథ చెప్పారు రిషబ్ శెట్టి. మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. అయితే ఆసక్తిగా మొదలైన కథలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయ సన్నివేశాలు, వినోదం కోసం చేసిన ప్రయత్నాలు సాగదీసినట్టు అనిపించాయి. విశ్రాంతికి ముందు, తర్వాత కథనం కొంత నెమ్మదించింది. అయితే మళ్ళీ క్లైమాక్స్ కుర్చీ నుంచి పక్కకు కూడా చుడనివ్వకుండా కట్టిపడేసింది.

Rishab Shetty Kantara Chapter 1 Movie Review

తెరపై ‘కాంతార ఛాప్టర్ 1’ కథానాయకుడు రిషబ్ శెట్టి అయితే… తెరవెనుక అసలైన కథానాయకులు ఛాయాగ్రాహకుడు అరవింద్ ఎస్ కశ్యప్, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్. రిషబ్ శెట్టి ఊహకు కెమెరా వర్క్, మ్యూజిక్ ప్రాణం పోశాయి. టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్న చిత్రమిది. రచయితగా రిషబ్ శెట్టి ప్రతిభ గుళిక నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించింది. వీఎఫ్ఎక్స్ చేసిన టీంను మెచ్చుకోవాలి. బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. హోంబలే ఫిలిమ్స్ భారీగా ఖర్చు చేసింది. 

రిషబ్ శెట్టిని తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. దైవిక శక్తి ఆవహించిన సన్నివేశాలను ఆయన తప్ప మరొకరు చేయలేరేమో అన్నట్టు, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా నటించారు. రుక్మిణీ వసంత్ పాత్ర మొదట సాధారణంగా అనిపించినా పతాక సన్నివేశాలకు వచ్చేసరికి ట్విస్ట్ ఇచ్చారు. ఆమె నటన సైతం బావుంది. జయరామ్, గుల్షన్ దేవయ్య ఓకే. కామెడీ ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన పాత్రలు పెద్దగా మెప్పించలేదు. 

Kantara Chapter 1 Review

తీర్పు:

రిషబ్ శెట్టి రుద్రతాండవం ‘కాంతార ఛాప్టర్ 1’. వన్ మ్యాన్ షో చేశారు. దైవిక శక్తి ఆవహించినప్పుడు విశ్వరూపం చూపించారు. నటుడిగా, దర్శకుడిగా దైవిక శక్తి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ప్రతిభ చూపించారు. ‘కాంతార’ తరహాలో పతాక సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రిషబ్ నటన, ముగింపు కోసం సినిమాను తప్పకుండా చూడాలి.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.