పురుషః మూవీ రివ్యూ
Published మే 22, 2026 by Srinivas
మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుంది. ఒక ఎమోషన్, కామెడీ అన్నీ కలగలపి అందించాలే కానీ ప్రేక్షకులు ఆనందంగా సినిమా చూస్తారు. అలాగే ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రమోషన్స్‌లో మేకర్స్ గట్టిగానే చెప్పడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘పురుషః’ అందుకుందా? చూద్దాం.

కథేంటంటే..
పెళ్లయిన మగవారి ఇబ్బందులను, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ను కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు వీరు ఉలవల తెరకెక్కించారు. గోవింద్ (పవన్ కల్యాణ్), తిమూర్తి (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరి భార్యలు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక) విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కడంతో సినిమా ఆరంభమవుతుంది. కోర్టు మెట్లైతే ఎక్కుతారు కానీ విచారణకు మాత్రం హాజరు కారు. తిమూర్తి, శ్రీను మాత్రం తమ భార్యల నుంచి తమకు మోక్షం కల్పించమని జడ్జి (వీటీవీ గణేష్)ను వేడుకుంటారు. దీంతో విసుగు చెందిన జడ్జి అసలు గొడవేంటో చెప్పమని గోవింద్, తిమూర్తి, శ్రీనులను పిలిచి అడుగుతాడు. అప్పుడు గోవింద్ తన కథ చెప్పడం మొదలు పెడతాడు. తన భార్య కమలకు తానెంటో చాలా ఇష్టమని చెబుతాడు. తన లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఆ తరువాత ముగ్గురు స్నేహితులూ కలిసి తమ చిన్ననాటి స్నేహితుడు క్రియేటివ్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్లికి వెళ్లడం.. అక్కడేం జరిగింది? రోజీ (గ్యాబి రాక్) ఎవరు? పెళ్లికి వచ్చిన దేవిక (అనైరా గుప్తా) అనే అమ్మాయితో తిమూర్తి, శ్రీనులకు ఉన్న సంబంధం ఏంటి? వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.
సినిమా ఎలా ఉందంటే..
గతంలో ఇదే తరహా చిత్రాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ‘సరదా సరదాగా’, ‘పెళ్లాం ఊరెళితే’ వంటి చిత్రాలు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆ తరహా కథతోనే ‘పురుషః’ కూడా వచ్చింది కానీ ఆ స్థాయిలో మాత్రం ప్రేక్షకుల ఆదరణను అందుకోవడం కష్టమే. సమాజంలో మగవాళ్లు భార్యల కారణంగా ఎదుర్కొంటున్న కష్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ హఫ్ అంతా పాత్రల పరిచయం.. గోవింద్, కమల లవ్ స్టోరీ వివాహం, కోర్టు సీన్లు వంటి అంశాలతో రూపొందింది. కిస్సు పెళ్లిలో అసలు నిజాలు బయటపడే సీన్‌తో ఇంటర్వెల్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్‌లో అసలు కథ ప్రారంభమవుతుంది. రోజీ పాత్ర ఎంట్రీ, ఫైనల్‌గా ఒక ఎమోషనల్ టచ్‌తో సినిమాను దర్శకుడు ముగించారు. కానీ ఎమోషన్ అనేది పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాలో కామెడీ ఒక్కటి మాత్రం పర్వాలేదనిపిస్తుంది. అంతకు మించి సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. పైన చెప్పుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో దీనికి కంపారిజనే లేదు. చిన్ననాటి చిలిపి పనులను ఒక బుక్‌లో చూసేసి విడాకుల వరకూ భార్యలు వెళ్లడమే చాలా కామెడీగా అనిపిస్తుంది. పైగా కొన్ని సన్నివేశాల్లో ముగ్గురు స్నేహితులను సూపర్ హీరోలుగా చూపించి వారి భార్యలతో ఫైట్ చేసే పారడీ సీన్లు చాలా విసుగు తెప్పిస్తాయి. తిమూర్తి, శ్రీనులను భార్యలు కొట్టే సీన్లు మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మొత్తంగా సినిమాలో కామెడీని కొంత మేర ఆస్వాదించవచ్చు. అంతకు మించి సినిమా ఆకట్టుకోవడం కష్టమే.

ఎవరెలా నటించారంటే..
హీరో పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన తండ్రి బత్తుల కోటేశ్వరరావు సినిమాకు ప్రొడ్యూసర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి బిడియం ఎక్కువని దానిని పోగొట్టేందుకే ఆయనతో సినిమా తీసినట్టుగా వెల్లడించారు. పవన్ కూడా ఏదో ఫ్రీగా సినిమా చేసినట్టుగా అనిపించలేదు. కొంత బిడియంతోనే నటించినట్టుగా కొన్ని సన్నివేశాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఇక కసిరెడ్డి విషయానికి వస్తే.. తన పాత్రలో చక్కగా నటించాడు. కసిరెడ్డి పాత్ర బాగానే కామెడీని పండిస్తుంది. ఇక సప్తగిరి అయితే ఎక్కడా బోర్ కొట్టించలేదు. పాస్టర్‌గా తనదైన స్టైల్లో కామెడీని వర్కవుట్ చేశాడు. వెన్నెల కిషోర్ పాత్రే ఈ చిత్రంలో కీలకం. సినిమాను మరో మలుపు తిప్పే పాత్ర. ఇక ఆయన గురించి చెప్పేదేముంది? తన పాత్రలో జీవించేశారు. వీటీవీ గణేష్ కూడా చక్కగా నటించారు. హీరోయిన్ విషిక ఒక మధ్యతరగతి ఇల్లాలిలా చాలా హోమ్లీగా కనిపించి మెప్పించింది. వైష్ణవి కొక్కుర, హాసిని సుధీర్, గ్యాబి రాక్ తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు.
టెక్నికల్ పరంగా..
డైరెక్టర్ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించి ఉంటే సినిమా చాలా బాగుండేది. ముఖ్యంగా సూపర్ హీరో సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోకపోగా విసుగు తెప్పిస్తాయి. ఎమోషనల్ టచ్ అనేది కరక్ట్‌గా ఇవ్వలేకపోయారు. ఏదో కొన్ని సినిమాలను గ్రైండర్‌లో వేసి తీసి సినిమాగా రూపొందించినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. విజువల్స్ మాత్రం బాగానే ఉన్నాయి. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.
ఫైనల్‌గా.. ‘పురుషః’ కొంతమేర నవ్విస్తుంది.
Rating: 



(2/5)
