Download App
Movie Poster

The Taj Story

Cast: Paresh Rawal, Zakir Hussain, Amruta Khanvilkar, Namit Das

Director: Tushar Amrish Goel

Release Date: August 12, 2026

ది తాజ్ స్టోరీ మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 13, 2026 by Srinivas

తాజ్‌మహల్.. ప్రేమకు ప్రతీక.. ఇదొక స్మారక చిహ్నం. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి రోజుకు వేలాది మంది టూరిస్ట్‌లు దీనిని సందర్శించుకుంటూ ఉంటారు. అలాంటి తాజ్‌మహల్ మూలాలపైనే సందేహం ఓ టూరిస్ట్‌కు రావడం.. దానిపై కేసు వేయడం.. దానిని కోర్టు విచారణకు స్వీకరించడం.. తదినంతర పరిణామాలతో ‘ది తాజ్ స్టోరీ’ అనే చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

The Taj Story Movie Review

కథేంటంటే..

విష్ణు దాస్ (పరేష్ రావల్) ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద 25 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ప్రభుత్వ అనుమతి పొందిన టూరిస్ట్ గైడ్. తన కుమారుడు అవినాష్ (నమిత్ దాస్) కూడా టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తుంటాడు. అయినా కూడా వీరి కుటుంబం అతి కష్టంగా జీవనం సాగిస్తూ ఉంటుంది. విష్ణు మొఘల్ పాలకుడు షాజహాన్, ముంతాజ్ మధ్య ప్రేమకథను.. ఆమె జ్ఞాపకార్థమే ఈ స్మారక చిహ్నం నిర్మించబడిందనే కథను విష్ణుదాస్ రోజూ పర్యాటకులకు చెబుతుంటాడు. అయితే తాజ్‌మహల్‌కు సంబంధించిన ‘ఇప్పటివరకూ బయటపడని నిజం’ అంటూ మద్యం మత్తులో విష్ణు చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అతడిని ముస్లిం మేనేజ్‌మెంట్ కమిటి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. ఆ తరువాత విష్ణు అసలు ఈ కట్టడాన్ని షాజహాన్ నిర్మించలేదని.. తాజ్‌మహల్ కింద ఉన్న 22 గదులే అందుకు సాక్ష్యమంటూ కొత్త వాదాన్ని లేవనెత్తి దానిపై కోర్టులో కేసు వేస్తాడు. అయితే ఆయన లాయర్‌ను కొందరు బెదిరించడంతో ఈ కేసు నుంచి తప్పుకుంటాడు. దీంతో విష్ణు దాస్ తన కేసును తనే వాదించుకుంటాడు. ఆయన వాదన ఎలా సాగింది? దీనిపై ఆయనకు.. అపోనెంట్ లాయర్‌కు మధ్య వాదోపవాదాలు ఎలా జరిగాయి. ఫైనల్‌గా తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

వాస్తవానికి ఇదొక కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిస్తే ఎలా ఉండేదో కానీ తాజ్ మహల్ మూలాలపై ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న కుట్ర సిద్ధాంతాల సమాహారంగా మారడమే ఒకింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తాజ్ మహల్ కింద ఉన్నాయని చెప్పబడే 22 మూసివేసిన గదుల ప్రస్తావనను పదేపదే ప్రస్తావించడం జరిగింది. విష్ణుదాస్.. ఓ టూరిస్ట్ గైడ్ నుంచి పవర్‌ఫుల్ లాయర్‌గా మారిపోతాడు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ లాయర్‌గా ఉన్న తన అపోనెంట్‌ని సైతం తన వాదనతో ఫ్రీజ్ చేస్తూ ఉంటాడు. హైకోర్టు ధర్మాసనం ముందు వాదిస్తూ, తాజ్ మహల్ వాస్తవానికి ఓ హిందూ రాజు నిర్మించిన రాజభవనం అని, తరువాత షాజహాన్ దాన్ని స్వాధీనం చేసుకుని ముంతాజ్ మహల్ సమాధిగా మార్చాడని అతను వాదిస్తాడు. ఈ సినిమా ప్రధానంగా.. చారిత్రక వాస్తవాలను పక్కనబెట్టి.. తాజ్‌మహల్ చుట్టూ ఒక ప్రేమకతను నిర్మించారని చెబుతుంది. అయితే ఈ వాదనలను బలమైన చారిత్రక ఆధారాలతో నిరూపించి ఉంటే బాగుండేది. కానీ ఇప్పటికే ప్రచారంలో ఉన్న అనుమానాలు, సిద్ధాంతాల ఆధారంగానే వాదనను అంతా నడిపించారు. అలాగే ఆగ్రా టూరిజం మొత్తంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేతిలో ఉన్నట్టుగా చూపించారు. అంటే ఈ సినిమా ఒక మతాన్ని టార్గెట్ చేసిందా? అనే సందేహం రాకమానదు. ఇక వాదనలు మాత్రం ఆసక్తికరంగానే నడుస్తాయి. అన్ని విషయాలనూ పక్కనబెట్టి అదొక సినిమాగా మాత్రమే చూస్తే ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది.

The Taj Story Movie Review

ఎవరెలా నటించారంటే..

పరేష్ రావెల్ తన పాత్రలో జీవించారు. ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా నటించారు. ఇది పరేష్ రావెల్ వన్ మాన్ షో అని చెప్పాలి. ఇక జాకీర్ హుస్సేన్ ఈ చిత్రం ప్రత్యర్థి న్యాయవాదిగా నటించి మెప్పించారు. అమృత ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు చాలా బయాస్డ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపించింది. సినిమా పరంగా ఇంట్రస్టింగ్‌గానే నడిపించారు. ఇక మ్యూజిక్ పాటలేం ఉండవు కానీ బీజీఎం బాగానే ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ పెద్దగా సెట్ అవలేదు.

ఫైనల్‌గా.. ‘ది తాజ్ స్టోరీ’ సినిమాగా చూస్తే ఓకే.. వాస్తవాల్లోకి వెళితే నాట్ ఓకే

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.