
తమిళనాడులో ఉత్కంఠ కొనసాగుతోంది, టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై ఇంకా స్పష్టత రాలేదు. తమిళనాడు రాజకీయాలు గత కొన్ని రోజులుగా అసాధారణ మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అవుతారా, TVK ప్రభుత్వం ఏర్పడుతుందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాలనే కాదు, జాతీయ రాజకీయ వర్గాల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒక దశలో అయితే రేపే TVK అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వెల్లువెత్తాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సంకేతాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పరిస్థితులు మాత్రం , అంత సులభంగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని సూచిస్తున్నాయి.
మొదట TVK కూటమి మెజారిటీకి దగ్గరగా వచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో సంఖ్యాపరంగా మెజారిటీ సాధించినట్లుగా ప్రచారం జరిగింది. రాజకీయ వర్గాల్లో కూడా “విజయ్ ప్రభుత్వం ఖాయం” అనే భావన రాష్ట్రం అంతా వ్యాపించింది. కానీ గంటలు గడిచేకొద్దీ పరిస్థితి మారడం ప్రారంభమైంది.
ప్రత్యేకంగా VCK, IUML పార్టీ ల వైఖరి చుట్టూ గందరగోళం నెలకొంది. మొదట మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు వచ్చినా, తరువాత అధికారిక స్థాయిలో స్పష్టత లేకపోవడం రాజకీయ అనిశ్చితిని పెంచింది. కొన్ని మీడియా వర్గాలు ఈ రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొంటుండగా, మరికొన్ని రిపోర్టులు “షరతులతో కూడిన మద్దతు” అనే కోణాన్ని ప్రస్తావిస్తున్నాయి.
ఇక్కడ అసలు సమస్య సంఖ్యల కంటే విశ్వసనీయత. గవర్నర్ ముందు ఎవరి దగ్గర ఎంత బలం ఉంది అన్నది కేవలం మీడియా ప్రకటనలతో సరిపోదు. అధికారిక లేఖలు, మద్దతు పత్రాలు, కూటమి స్పష్టత ఇవన్నీ అవసరం. అదే ఇప్పుడు TVK ముందున్న ప్రధాన సవాలు. ఇంకో కీలక అంశం ఏమిటంటే, తమిళనాడు రాజకీయ చరిత్రలో సంఖ్యల ఆట చివరి క్షణం వరకు మారిపోవడం కొత్త విషయం కాదు. బయటకు ఒక ప్రకటన, లోపల మరో చర్చ, చివరికి పూర్తిగా భిన్నమైన రాజకీయ సమీకరణ ఇవి అక్కడి రాజకీయాల్లో సర్వ సాధారణం అని తమిళ రాజకీయాలమీద అవగాహన ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. అందుకే “రేపు ప్రమాణ స్వీకారం ఖాయం అని ప్రకటించిన చానల్స్ మళ్ళీ మూగబోయాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చూస్తే, రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేదు. గవర్నర్ అధికారిక ఆహ్వానం, మద్దతు పార్టీల స్పష్టమైన లేఖలు అందే వరకు, ఈ ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు గవర్నర్ ఆహ్వానించలేదు. సినిమా ప్రపంచంలో అద్భుతమైన ప్రజాదరణ సంపాదించిన విజయ్‌కు ఇది అసలు సిసలు రాజకీయ పరీక్ష. విజయ్ కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ తమ పార్టీ MLA లను, హైదరాబాద్ తరలిస్తుంది.
ముగింపు: ఈ కథ లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం AMMK దినకరన్ AIADMK ను గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఆహ్వానించాలి అని అనడం గమనార్హం. 116 సభ్యుల బలం ఉన్న టీవీకే అధినేత ను పిలవలేదు కానీ, AIADMK ను ఎలా పిలుస్తారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం, రాజకీయ చాతుర్యం, కూటమి నిర్వహణ ఇవే చివరికి నిర్ణయాత్మక అంశాలు అవుతాయి. తమిళనాడు ఇప్పుడు అదే సమాధానం కోసం ఎదురుచూస్తోంది.
