
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతూ ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడి, అతిపెద్ద పార్టీగా ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఆవిర్భవించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యం రాజ్యాంగ నైతికతను ప్రశ్నిస్తోంది. గవర్నర్ ను ఇప్పటికీ రెండు సార్లు కలిశారు “టీవీకే అధినేత విజయ్”. అతి పెద్ద పార్టీ గా అవతరించిన పార్టీ ను ఆహ్వానించవలసిందే గవర్నర్. కాని ఎందుకు ఈ సాగతీత ధోరణి అవలంబిస్తున్నారో అర్ధం కావడం లేదు అని తమిళ యువత సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజల తీర్పును తప్పకుండా గౌరవించాల్సిందే… ఇప్పుడు తమిళ యువత నే కాకుండా, టీవీకే రాజకీయ వర్గాల తో పాటు, తమిళ కళాకార ప్రపంచం కూడా తమ గళంతో ఈ పరిణామాలను తప్పుబట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు సైతం ఈసారి బహిరంగంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. “మక్కల్ నీది మయ్యం” అధినేత కమల్ హాసన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్నాయి. “108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ఆహ్వానించకపోవడం అంటే ప్రజాతీర్పును అవమానించడమే” అని ఆయన అనడం ఎంతో మంది మనసులో ఉన్న భావన ను ఆవిష్కరించినట్టు అయ్యింది.
కమల్ హాసన్‌తో పాటు హీరో విశాల్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని ఎండగట్టడం గమనార్హం. డియర్ విజయ్.. నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి… అంటూ విశాల్ ఇచ్చిన భరోసా, “ఇది రాజ్యాంగ విరుద్ధం” అన్న ప్రకాష్ రాజ్ విమర్శలు చూస్తుంటే కోలీవుడ్ మొత్తం విజయ్ వెనుక నిలబడతుంది అని అర్థమవుతోంది. వ్యక్తిగతంగా కొంతమంది నటులు ఆయనను కలసి మద్దతు తెలుపుతున్నారు.
అందరూ ఇప్పుడు “ఎస్.ఆర్. బొమ్మై” కేసును గుర్తుకు తెస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు 1994 నాటి చారిత్రాత్మక “ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా” కేసును గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే…. “ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో నిర్ణయించాల్సింది రాజభవన్లో కాదు, అసెంబ్లీ వేదికపైనే.” అని వ్యాఖ్యానించింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బొమ్మై కేసులో వెలువడిన ఆ తీర్పు ప్రకారం, అతిపెద్ద పార్టీగా నిలిచిన వారికి, సభలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం గవర్నర్ ప్రాథమిక బాధ్యత. కానీ, తమిళనాడు లో 233 మంది ప్రజా ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది ఏమో అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. బొమ్మై కేసు స్ఫూర్తిని విస్మరించి నిర్ణయాలు తీసుకుంటే అది “ప్రజాస్వామ్య హత్యే” అవుతుంది అని అంటున్నారు.
సినిమా గ్లామర్‌ను పక్కన పెట్టి, ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన, “టీవీకే అధినేత విజయ్” ఇప్పుడు కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయనకు తోటి నటీనటులు అందిస్తున్న మద్దతు కేవలం వ్యక్తిగత స్నేహం మే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకూడదు అని, గవర్నర్ ఇకనైనా జాప్యం వీడి, రాజ్యాంగ బద్ధంగా అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలి. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించడమే అందరి తక్షణ కర్తవ్యం. ప్రజాతీర్పును కాలరాసే ప్రయత్నం జరిగితే, అది కేవలం తమిళనాడుకే కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కి విరుద్ధం.
ఈ తరుణంలో “డీఎంకే అధినేత స్టాలిన్” తన వ్యాఖ్యల ద్వారా అందరి మనసు చూరగొన్నారు. “టీవీకే” (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వాలని స్టాలిన్ పేర్కొన్నారు. “ప్రజల తీర్పును మేం గౌరవిస్తాం, వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాకుండా అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు….. “కొత్తగా ఏర్పడే టీవీకే ప్రభుత్వాన్ని మేం ఆరు నెలల పాటు ఇబ్బంది పెట్టం.. వారు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో, పరిపాలన ఎలా చేస్తారో వేచి చూస్తాం (Wait and Watch)” అని స్టాలిన్ ప్రకటించారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులైనప్పటికీ, ఎం.కె. స్టాలిన్ ప్రదర్శించిన పరిణితి ప్రశంసనీయం. ‘టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి.. ఆరు నెలల పాటు మేం అడ్డుపడం’ అని ఆయన ప్రకటించడం ద్వారా బంతిని ఇప్పుడు పూర్తిగా గవర్నర్ మరియు విజయ్ వైపునకు నెట్టారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు, ఎస్.ఆర్. బొమ్మై కేసు చెప్పినట్లుగా ‘ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే అంతిమ తీర్పు’ అనే సూత్రాన్ని బలపరచడమే.
ముగింపు: కోలీవుడ్ మద్దతు, స్టాలిన్ సానుకూల వైఖరి వెరసి.. ఇప్పుడు తమిళనాడు చూపు రాజభవన్ వైపే ఉంది. గవర్నర్ పిలిస్తే సరే లేకపోతే, రేపు “టీవీకే అధినేత విజయ్” సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది అని తమిళనాట రాజకీయ పండితులు చెబుతున్నారు.
