Download App

వెండితెర దళపతి… ఇక నుంచి ప్రజా దళపతి

మే 10, 2026 By Suresh Thota
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు సి. జోసెఫ్ విజయ్ ను తమిళనాడు కు 14వ ముఖ్యమంత్రిగా, 2026 మే 10 వ తేదీ ఆదివారం, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు ఆరు...
వెండితెర దళపతి… ఇక నుంచి ప్రజా దళపతి

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు సి. జోసెఫ్ విజయ్ ను తమిళనాడు కు 14వ ముఖ్యమంత్రిగా, 2026 మే 10 వ తేదీ ఆదివారం, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించారు.

దాదాపు ఆరు దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు DMK, AIADMK మధ్యే ఊగిసలాడిన అధికార పీఠం, ఈరోజు మూడో ప్రత్యామ్నాయం వైపు మళ్లింది. వెండితెర పై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన “ఇళయ దళపతి” సి. జోసెఫ్ విజయ్, ఇకపై తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో, తన పాలనకు శ్రీకారం చుట్టారు.

“చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం” లో ఉదయం 10 గంటలకు తన అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారులు మధ్య జరిగిన కార్యక్రమంలో, “గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్” విజయ్ చేత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈయన తో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 234 స్థానాలకు గాను TVK 108 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, VCK, IUML, CPI, CPI(M) మద్దతుతో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై విజయ్‌ను అభినందించినారు.

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

200 యూనిట్ల వరకు, గృహ వినియోగ దారులకు ఉచిత కరెంట్ అందించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక ఫోర్స్ (Anti-Drugs Force) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు నిర్ణయాల తో, తన పార్టీ భావజాలము ఎలా ఉంటుందో చెప్పినట్టు అయ్యింది.

వెండితెర దళపతి… ఇక నుంచి ప్రజా దళపతి

ఇక ఆయన ప్రసంగం ఆద్యంతం దేనికైనా “తానే అన్నిటికి బాధ్యత తీసుకుంటానని”, తనకు ఆకలి బాధలేంటో తెలుసని భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రమాణం అనంతరం చేసిన ప్రసంగంలో విజయ్ తన నేపథ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నాకు పేదరికం, ఆకలి తెలుసు. నేను రాజకుటుంబం నుంచి రాలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను. అని చెప్పారు. “నేను మీ కొడుకు లాంటివాడిని, మీ అన్నయ్య లాంటివాడిని. మీరు నాకు మీ గుండెల్లో చోటిచ్చారు” అంటూ వేలాది మంది అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను ఇక్కడికి ముఖ్యమంత్రిగా రాలేదు, మీ ఇంట్లో ఒక సభ్యుడిగా వచ్చాను. మీ విజయ్ మామ మీ కోసం అన్నీ మంచి పనులే చేస్తాడు. మీరే నా ప్రాణం” అంటూ తన యువ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

తన పాలనపై స్పష్టత ఇచ్చారు…. “ఒకే పవర్ సెంటర్ ఉంటుంది, అది నేనే” అని విజయ్ స్పష్టం చేశారు. గత DMK ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని ఆరోపిస్తూ, 2021-2026 ఆర్థిక పరిస్థితిపై త్వరలో వైట్ పేపర్ విడుదల చేస్తామని ప్రకటించారు. “ప్రజా ధనాన్ని వృధా చేయను, దోచుకోను. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కానివ్వను” అని, ఇతర పార్టీల పై ఆరోపణలు చేస్తూనే నర్మ గర్భం గా మాట్లాడారు. తప్పుడు హామీలు ఇవ్వను , ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాను. విద్య, వైద్యం, నీరు, మహిళా భద్రత, రైతులు, మత్స్యకారుల సంక్షేమంపై పూర్తి దృష్టి పెడతానని చెప్పారు.

విజయ్ ప్రమాణ స్వీకారం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. “తిరు సి. జోసెఫ్ విజయ్‌కి అభినందనలు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తూనే ఉంటుంది” అని X వేదికగా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా, కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందనే సంకేతాన్ని ఇచ్చినట్లు అయ్యింది.

అయితే సినిమా గ్లామర్ ఒక ఎత్తు, పరిపాలన మరో ఎత్తు. ప్రజలు విజయ్‌పై పెట్టుకున్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, రూ.10 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, డ్రగ్స్, అవినీతి లేని తమిళనాడును నిర్మించడం ఇవన్నీ విజయ్ ముందున్న సవాళ్లు.

‘ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్’ అని అభిమానులను పిలిచే విజయ్, ఇకపై 8 కోట్ల తమిళ ప్రజల గుండెల్లో నిలిచే పాలన అందిస్తారని కోరుకుందాం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading