Download App

రేపే విజయ కేతనం ఎగురవేస్తున్న ఇళయ దళపతి…

మే 9, 2026 By Suresh Thota
"శ్రీవారికి ప్రేమలేఖ" సినిమాలో పెళ్లి ముహూర్తం ఖాయం కాగానే "అయితే పెళ్లి ఉందా… నేను వెళ్లి పట్టుచీర కట్టుకోనా"… అని ఒక పాత్ర ఆత్రుతగా అడుగుతుంది. కొద్దిసేపటికి… "పెళ్లి లేదు వాయిదా పడ్డది అనగానే అయితే చీర విప్పేయమంటారా" అని అడిగే సీన్ గుర్తు ఉందా…. ఇలా రెండు,...
రేపే విజయ కేతనం ఎగురవేస్తున్న ఇళయ దళపతి…

“శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాలో పెళ్లి ముహూర్తం ఖాయం కాగానే “అయితే పెళ్లి ఉందా… నేను వెళ్లి పట్టుచీర కట్టుకోనా”… అని ఒక పాత్ర ఆత్రుతగా అడుగుతుంది. కొద్దిసేపటికి… “పెళ్లి లేదు వాయిదా పడ్డది అనగానే అయితే చీర విప్పేయమంటారా” అని అడిగే సీన్ గుర్తు ఉందా…. ఇలా రెండు, మూడు సార్లు జరుగుతుంది. అలాగే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ సరిగ్గా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. గత అయిదు రోజులుగా వేరే పార్టీ ల మద్దతు ఉంటుందా…? ఉండదా…? మెజారిటీ వస్తుందా…? రాదా…? అన్న సందిగ్ధత మధ్య, చివరకు చిన్న, చిన్న పార్టీల మద్దతు లేఖలు లోక్ భవన్ కు అందిన తర్వాత, గవర్నర్ నుంచి పిలుపు రావడంతో, ఇప్పుడు అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు వరకు ఆ సినిమా సీన్ తరహాలోనే.. రేపు మన “విజయ్ ప్రమాణ స్వీకారం ఉందా…. మేము వెళ్లి జెండాలు తెచ్చుకోమా… అన్నట్టుగానే ఉంది చెన్నై లో టీవీకే కార్యకర్తల పరిస్థితి. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో పెళ్లి బాజాలు మోగినట్లుగానే, రేపు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగబోతోంది.

అయిదు రోజుల నాటకీయ పరిణామాలకు నేడు తెరపడింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలవుతోంది. ఎట్టకేలకు తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత ఇళయ దళపతి విజయ్, రేపు అనగా మే 10 వ తేదీన, ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన తో 9 మంది మంత్రులుగా, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది సాధారణ విషయం కాదు, ఒక వ్యక్తి తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతమైన ప్రయత్నం. నిజం చెప్పాలంటే తలపండిన, DMK , AIADMK నాయకులతో తలపడి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి విజయ్ భగీరథ ప్రయత్నమే చేశారు.

ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, విజయ్ ముఖ్యమంత్రి పీఠం వరకు సాగించిన ప్రయాణం నల్లేరు మీద నడక గా సాగలేదు. మేజిక్ ఫిగర్ (118) కోసం అవసరమైన బలం విషయంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలు ఒక దశలో ప్రతిష్టంభనను సృష్టించాయి. అయితే, ఎక్కడా వెనకడుగు వేయకుండా, సహనం కోల్పోకుండా, రాజకీయ చాతుర్యంతో కాంగ్రెస్, వామపక్షాలు (CPI, CPM), VCK మరియు IUML వంటి పార్టీల మద్దతును కూడగట్టడంలో ఆయన విజయం సాధించారు. మిత్రపక్షాల మద్దతుతో టీవీకే బలం ఇప్పుడు 120 కి చేరడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం.

గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ని, ఏకంగా మూడుసార్లు కలిసి, ఎక్కడా నిరుత్సాహ పడకుండా, రాజ్యాంగబద్ధంగా తన బలాన్ని నిరూపించుకోవడమే ఆయన పట్టుదలకు నిదర్శనం. టీవీకే అధినేత అధికార పీఠాన్ని అధిరోహించడానికి, చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం రేపు ఉదయం 10 గంటలకు, ఈ అపూర్వ ఘట్టానికి వేదిక కానుంది. “గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్” ఆహ్వానం మేరకు, తనపై నమ్మకం ఉంచిన లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సినిమా గ్లామర్‌ను ప్రజాసేవకు మళ్లించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇస్తున్న వీసీకే.. “మేం ప్రభుత్వంలో భాగం కాబోము. వెలుపలి నుంచే మద్దతు ఇస్తాం. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకుండా ఉండేందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం అని వీసీకే చీఫ్ తిరుమావళవన్‌ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే వామపక్షాలు కూడా క్యాబినెట్‌ పదవులు వద్దని చెప్పిన విషయం తెలిసిందే. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే తరువాత, సానుభూతి తో టీవీకే అత్యధికమైన సీట్లు గెలుస్తుంది అని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు ఒక కారణం అని చెన్నై రాజకీయ నిపుణుల రహస్య బోగట్టా…

రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో విమర్శలు, ఎన్నో అనుమానాలు. కానీ, వాటన్నింటికీ విజయ్ తన మౌనంతోనే సమాధానమిచ్చారు. ఏదైనా సాధించాలను కున్నప్పుడు ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలే తప్ప, వచ్చే అడ్డంకులకు భయపడకూడదని ఆయన నిరూపించారు.

ఆయన తన చిత్రం బిగిల్ లో ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పినట్లుగా, గెలుపు అనేది మనల్ని వెతుక్కుంటూ రాదు.. ఆ గెలుపును మనమే వెతుక్కుంటూ వెళ్లి లాక్కోవాలి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో పోరాడి సాధించిన ఈ విజయానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ డైలాగ్ ఆయన అంతరంగాన్ని చెప్పకనే చెబుతున్నది. ఆ పట్టుదలే ఇప్పుడు తమిళనాట విజయ గర్జనై ప్రతిధ్వనిస్తోంది.

ప్రజా శ్రేయస్సే ఊపిరిగా, అదే తన సంకల్పంగా విజయ్ చేపడుతున్న ఈ కొత్త ప్రయాణం తమిళనాడు అభివృద్ధిలో సరికొత్త మైలురాయి గా నిలవాలని కోరుకుందాం. తన గతాన్ని తవ్వుతున్న విమర్శకులకు సమాధానంగా, తను నటించిన మాస్టర్లోని ఒకే ఒక్క డైలాగ్ తో ప్రత్యర్ధుల నోరు మూయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా… అది ​నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నావన్నదే ముఖ్యం. ఇది మా ఇళయ దళపతి విజయ్ స్టైల్ అంటున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading