
ఢిల్లీ టూర్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత గల రహదారి ప్రాజెక్టుల మంజూరుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమల విస్తరణకు, వాణిజ్యానికి అవసరమైన గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, ఎలివేటెడ్ కారిడార్‌లు, జాతీయ రహదారి విస్తరణకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి తన వినతిలో ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వాణిజ్యానికి కొత్త దారులు తీసుకురావడమే కాకుండా, రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
అలాగే, ట్రిపుల్ ఆర్ నార్త్ ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం భూసేకరణ పూర్తయిందని గుర్తు చేశారు. మిగిలిన అనుమతులు వెంటనే మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు సహకరించాలని గడ్కరీని కోరారు.

సీఎం రేవంత్ మరో కీలక డిమాండ్‌గా మన్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇది పర్యాటక అభివృద్ధికి, రహదారి భద్రతకు, ప్రాంతీయ కనెక్టివిటీకి మేలు చేస్తుందని వివరించారు.
రావిర్యాల – ఆమనగల్ – మన్ననూర్ మధ్య నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కూడా తక్షణ అవసరమని సీఎం అన్నారు. హైదరాబాదు – శ్రీశైలం రూట్‌లో వాహన రద్దీ తగ్గించడానికి ఇది కీలకమని చెప్పారు.
అదేవిధంగా, హైదరాబాద్ – మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఉత్తర తెలంగాణ అభివృద్ధికి, ఖనిజ వనరుల రవాణాకు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కనెక్టివిటీకి అత్యంత ఉపయోగకరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.
