
మేడిగడ్డ బ్యారేజ్లో చిన్నపాటి మరమ్మతులతో గోదావరి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే కాంగ్రెసు ప్రభుత్వం పనిచేస్తోంది అని మాజీ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు.
ఇక సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు బయటపడతాయన్న భయంతో ప్రభుత్వం నిశ్శబ్దంగా మరమ్మతులు మొదలుపెట్టిందని, ఇది ప్రజలకు తెలియకుండా జరగాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
“సుంకిశాలలో ఎక్స్పర్ట్ కమిటీ లేదు, విజిలెన్స్ కమిషన్ లేదు, జ్యుడీషియల్ ఎంక్వైరీ లేదు, ఎన్డీఎస్ఏ నివేదిక లేదు – ఏదీ లేకుండానే సైలెంట్ గా రిపేర్లు చేస్తున్నారు. అదే మేడిగడ్డకు వచ్చేసరికి, రెండు పియర్స్ కుంగితే మాత్రం అన్ని కమిటీలు, విచారణలు తెరపైకి వచ్చాయి” అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్డీఎస్ఏ, ఎక్స్పర్ట్ కమిటీలు, రిటైర్డ్ ఇంజనీర్‌లు, వివిధ సంస్థలు మేడిగడ్డ పియర్స్ రిపేర్ చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయని, కన్స్ట్రక్షన్ కంపెనీ సైతం రిపేర్‌కు సిద్ధంగా ఉన్నదన్నా సత్వర చర్య తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కేవలం రాజకీయ ప్రతీకారం కోసమే తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టే తీరు, ఇది కాంగ్రెస్ మార్కు ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనం అంటూ హరీష్ రావు తన సోషల్ మీడియా ఎక్స్ (X) ఖాతా ద్వారా పేర్కొన్నారు.
