వీరభద్రుని రహస్యం (15-20 Episodes) వెబ్ సిరీస్ రివ్యూ
Published ఆగస్ట్ 2, 2026 by Srinivas
1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘వీరభద్రుని రహస్యం’ ఇప్పుడిప్పుడే కథలోకి వెళుతోంది. నాలుగవ వారం మరో ఐదు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. అంటే ఇప్పటి వరకూ మొత్తంగా 20 ఎపిసోడ్స్‌ను మేకర్స్ వదిలారు. ఈ ఐదు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? పూర్తి స్థాయిలో కథలోకి దర్శకుడు తీసుకెళ్లాడా? గత వారం అయితే ఈ సిరీస్ ఆసక్తికరంగానే నడిచింది. ఇక ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే..
ప్రతి ఎపిసోడ్‌నూ 1972లో జరిగిన కథతో మొదలు పెడుతున్నాడు దర్శకుడు. ఆ సమయంలో ఏం జరిగింది? నాంచారి (అనురాధ) ఆమె చిన్న కొడుకు కలిసి ఊరిలోని వారిని ఎలా దోచుకున్నారు? వంటి విషయాలను చూపించారు. ఇక 1990 విషయానికి వస్తే.. వెన్నెల (అన్ని).. తన మనిషికి చంపేందుకు వచ్చిన సెబాస్టియన్‌ను అడ్డుకుంటుంది. దీంతో అతను ఆమె మెడపై సూది గుచ్చి పరారవుతాడు. వెన్నెలకు వెంటనే వైద్యం అందడంతో ఆమె కోలుకుంటుంది. అయితే తనను చూసిన వెన్నెలను చంపేందుకు సెబాస్టియన్ తన మనిషికి పంపిస్తాడు. సెబాస్టియన్ మనిషి ఆ ఊరిలోనే ఉంటూ వెన్నెలను చంపేందుకు యత్నిస్తూ ఉంటాడు. మరోవైపు కల్పన తన ఊరిలో క్లినిక్ పెట్టేందుకు నిర్వహించిన అంగీకార పూజలో వెన్నెల చేసిన పని గురించి కల్పన తల్లికి తెలుస్తుంది. దీంతో వెన్నెల కారణంగా తమ కుటుంబానికి ఎలాంటి పరిణామాలు వస్తాయోనని ఆమె భయపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరభద్రుడు వచ్చి కొందరి ఇళ్ల ముందు కత్తి గుచ్చి వెళతాడు. ఆ ఇంట్లోని వారు ఏం చేశారో చెప్పి కత్తిని వీరభద్రుని వద్ద పెట్టేయాలి. అలా అందరూ చెబుతారు. యోగానందం ఇంటి వద్ద వీరభద్రుడు కత్తి గుచ్చడానికి కారణం వెన్నెలేనని తనే క్షమాపణ చెప్పాలని ఆ ఇంట్లోని వారు పట్టుబట్టడంతో ఆమె క్షమాపణ చెప్పేందుకు సిద్ధమవుతుంది. అప్పుడు పూజారి ఆమెను ఆపి ఆమె చేయని తప్పుకు ఆమెతో క్షమాపణ చెప్పిస్తారేంటని ప్రశ్నిస్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో తప్పు చేసిందెవరు? సెబాస్టియన్‌ను చూసిన వెన్నెల ఏం చేయనుంది? వెన్నెల తన తండ్రి జాడను తెలుసుకోవడంలో అడుగు ముందుకేసిందా? వంటి విషయాలను ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
గత వారం కథను కాస్త ఇంట్రస్టింగ్‌గానే తీసుకెళ్లిన దర్శకుడు.. ఈ వారం మాత్రం అంత ప్రభావం చూపించినట్టుగా అనిపించలేదు. ఈ వారం కథ ఏదో నడిపించినట్టుగా అనిపించింది. ఐదు ఎపిసోడ్స్ నామమాత్రంగానే ఉన్నాయి తప్ప కథను ఒక్క అడుగు కూడా ముందుకు నడిపించలేదు. కేవలం సాగదీత మినహా ఏమీ లేదు. అసలు యోగానందం ఇంట్లో తప్పు చేసిందెవరు? ఆ తప్పు ఏంటనేది మినహా ఆసక్తికరమనేదే లేదు. ‘మర్మదేశం’ చూసిన వారికి ఈ వెబ్‌సిరీస్ ఆకట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. కనీసం ఏ ఒక్క ఎపిసోడ్‌లో అయినా ఏమైనా ఇంట్రస్టింగ్ పాయింట్స్ చూపించి ఉంటే బాగుండేది. ఎపిసోడ్స్ నిడివి చాలా తక్కువ. అలాగే ఉన్నవి కేవలం 60 ఎపిసోడ్స్ మాత్రమే. ఇప్పటికే 20 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ వీరభద్రుడు తప్ప మరో ఆసక్తికర అంశమే వెబ్ సిరీస్‌లో కనిపించడం లేదు. ఇక చూడాలి మున్ముందు ఈ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో.
ఎవరెలా చేశారంటే..
నాంచారి పాత్రలో అనురాధ ఒదిగిపోయారు. చాలా క్రూయెల్‌గా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ఇక రఘు కుంచె విషయానికి వస్తే ఆయన పాత్ర ఈ వారం అయితే పరిమితమే. వెన్నెల పాత్రలో చేసిన అన్ని చుట్టే ఈ వారం ఐదు ఎపిసోడ్స్ తిరిగాయి. ఆమెకు కూడా అద్భుతంగా నటించారు. కార్తికేయ పాత్రలో రఘు కూడా బాగానే నటించారు. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటిస్తున్నారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు నాగ.. 1990 ‘మర్మదేశం’కు దర్శకత్వం వహించిన అనుభవం ఉండటంతో దీనిని కూడా అదే తరహాలో తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ ఈ వెబ్‌సిరీస్ ‘మర్మదేశం’ స్థాయిలో అయితే లేదనే చెప్పాలి. ఈ వారం ఎడిటింగ్ పేలవంగా ఉంది. సాగదీత తప్ప ఏమీ లేదు. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్‌కు తగినట్టుగానే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబం మొత్తం కూర్చొని చూడగలిగేలా ఎపిసోడ్స్ ఉంటున్నాయి.
ఫైనల్‌గా.. వీరభద్రుని రహస్యం క్రమక్రమంగా పవర్ తగ్గుతోంది.
Rating: 



(2.5/5)
