వీరభద్రుని రహస్యం (20-25 Episodes) వెబ్ సిరీస్ రివ్యూ
Published ఆగస్ట్ 8, 2026 by Srinivas
1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘వీరభద్రుని రహస్యం’ గత నాలుగు వారాలుగా పెద్దగా కథ అయితే అక్కడక్కడే నడిచింది. మరి ఐదో వారం అయినా కథ ముందుకు సాగిందా? ఏమైనా ట్విస్ట్‌లు ఉన్నాయా? అసలు ఐదో వారం ఏం జరిగింది? ఆసక్తికరంగా నడిచిందా? లేదా? అసలు ఈ వారం ఏం జరిగిందో తెలుసుకుందాం.

కథేంటంటే..
ప్రతి ఎపిసోడ్ కూడా 1972లో జరిగిన కథతో మొదలవుతుందన్న విషయం తెలిసిందే. ఈ వారంలో పరందామయ్య కుటుంబం నాంచారి (అనురాధ) ఆమె చిన్న కొడుకు కారణంగా ఎంత ఇబ్బంది పడింది? దీంతో వారు ఊరు వదిలి వెళ్లిపోవాలనుకోవడం వంటివి చూపించారు. ఆ తరువాత తల్లికి బాగోలేదని ఊరెళ్లిన వెన్నెల (అన్ని) తిరిగి వీరభద్రపురానికి వస్తుంది. తన తాతయ్య గురించి తెలుసుకుని ఆయన ఇంటికి వెళుతుంది. తాతయ్య ప్రేమకోసం తపన పడుతూ ఉంటుంది. మరోవైపు సెబాస్టియ్ మనిషి వెన్నెలను చంపేందుకు యత్నిస్తూ ఉంటాడు. వీరభద్రుడి ఆలయం వద్ద గుర్రం వెన్నెల పైకి దాడి చేసేందుకు వస్తుంది. దానిని కల్పన మేనత్త పుష్పవల్లి అడ్డుకుని గుర్రానికి దణ్ణం పెట్టడంతో అది వెళ్లిపోతుంది. అప్పుడు పుష్పవల్లి.. వెన్నెలతో చేయకూడని పనేదో చేస్తున్నావని.. అందుకే వీరభద్రుని గుర్రం నిన్ను హెచ్చరించిందని చెబుతుంది. ఇక పుష్పవల్లి.. సెబాస్టియన్ గ్యాంగ్‌లో గతంలో పని చేసిన బ్రహ్మం (కల్కి)ని పెళ్లి చేసుకుందని తెలుసుకుని వెన్నెల షాక్ అవుతుంది. యోగానందం (రఘు కుంచె) ఇంటికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తాడు. హాస్పిటల్‌కు అవసరమైనవన్నీ తనే ఇప్పిస్తానని చెబుతాడు. అలాగే ఎస్సై రవి సస్పెన్షన్ గురించి కూడా ఎమ్మెల్యేకు చెబుతారు. మళ్లీ ఉద్యోగంలో చేరేలా తాను చర్య తీసుకుంటానని ఎమ్మెల్యే చెబుతాడు. ఆ సమయంలోనే తనను ఎంతగా యోగానందం కుటుంబం నమ్ముతోందో తెలుసుకుని వాళ్లకు నిజం చెప్పాలని వెన్నెల భావిస్తుంది. ఆ తరువాత తన తండ్రే.. యోగానందం తండ్రిని చంపేశాడని ఆయనకు వెన్నెల చెబుతుంది. ఆ తరువాత వీరభద్రుడి గుర్రం వచ్చిన విషయం తెలుసుకుని వెన్నెల దానిని వెంబడిస్తుంది. ఆ గుర్రం ఎక్కడకు వెళ్లింది? అక్కడ పూజారి ఏం చేస్తున్నాడు? అసలు వెన్నెల తండ్రికి వీరభద్రపురానికి సంబంధం ఏమిటి? పరంధామయ్య కూతురు ఏమైంది? వంటి విషయాలన్నీ ఐదో వారం ఎపిసోడ్స్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
గత నాలుగు వారాలతో పోలిస్తే ఐదో వారంలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ చాలా ఆసక్తికరంగా నడిచాయి. అసలు 1970లో ఏం జరిగిందనేది క్రమక్రమంగా కథ రివీల్ చేస్తూ వస్తున్నాడు దర్శకుడు. అలాగే వెన్నెల అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ట్రై చేస్తోంది. యోగానందం ఫ్యామిలీ నిజం తెలిసినా ఆమెను ఆదరిస్తుంది. అంతేకాకుండా అసలు పుష్పవల్లి.. బ్రహ్మంను పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఆసక్తికరమే. మొత్తానికి ఆ ఊరిలో ఏదో జరుగుతోందన్న క్యూరియాసిటీ ఈ వారం ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే వెన్నెల తల్లికి.. నాంచారి కుటుంబంతో సంబంధం ఉందన్న విషయం కూడా తెలిసింది. కొన్నింటి గుట్టు విప్పుతూనే.. మరికొన్ని అంశాలను ఆసక్తికరంగా మలిచారు. మొత్తానికి కథలో ఇంట్రస్టింగ్ పార్ట్‌లోకి ఈ వారం దర్శకుడు తీసుకెళ్లడం జరిగింది. చూస్తున్న కొద్దీ ఎపిసోడ్స్ మరింత బాగుండే అవకాశం ఉందని అనిపిస్తోంది.
ఎవరెలా చేశారంటే..
నాంచారి పాత్రలో అనురాధ ఒదిగిపోయారు. ఇక ఈ వారం అన్ని, కార్తికేయ తదితరులు కీలక పాత్ర పోషించారు. రఘు కుంచె విషయానికి వస్తే ఆయన పాత్ర ఈ వారం బాగానే అనిపించింది. అన్ని చుట్టే ఈ వారం ఐదు ఎపిసోడ్స్ తిరిగాయి. ఆమె కూడా తన పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. కార్తికేయ పాత్రలో రఘు కూడా బాగానే నటించారు. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు నాగ.. 1990 ‘మర్మదేశం’ మాదిరిగానే ఈ సిరీస్‌ను కూడా ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఆ స్థాయిలో ఉందని చెప్పలేం కానీ ఇది కూడా ఇంట్రస్టింగ్‌గానే ఉంది. అయితే గత వారాలతో పోలిస్తే ఈ వారం ఇంట్రస్టింగ్‌గా సాగింది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్‌కు తగినట్టుగానే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబం మొత్తం కూర్చొని చూడగలిగేలా ఎపిసోడ్స్ ఉన్నాయి.
ఫైనల్‌గా.. వీరభద్రుని రహస్యం ఇంట్రస్టింగ్‌గా వెళుతోంది..
Rating: 



(2.75/5)
