అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ
Published జూలై 31, 2026 by Srinivas
కోర్టు రూం డ్రామాలకు క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. అది కానీ సరిగ్గా తీయగలిగారో ఓ రేంజ్‌లో ఆదరణ దక్కించుకుంటుంది. లేదంటే కష్టమే. నేటి (శుక్రవారం) నుంచి అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ ఓ కోర్టు రూం డ్రామా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో మరో ముఖ్య పాత్రలో ముఖేష్ రుషి నటించారు. శ్రీకాంత్ వర్సెస్ ముఖేష్ రుషి మధ్య వాదనలు ఎలా జరిగాయి? అసలు ఈ సిరీస్ ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే…
కోర్టు ఎదుట నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులు, లాయర్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో నారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే కోర్టులో లాయర్ అయిన పరశురాం (శ్రీకాంత్) తన వృత్తిని పక్కనబెట్టి నోటరీలు రాసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. లాయర్ అయిన వేద తనను జూనియర్‌గా చేర్చుకోమంటూ ఎందరో లాయర్లను సంప్రదిస్తుంది కానీ వారంతా ఆమెకు నో చెప్పేస్తారు. మరోవైపు పరుశురాం కొడుకు లాయర్ చదువుతానని లా జాయిన్ అయ్యి.. ఇక తాను చదవనని తండ్రికి తేల్చి చెప్పేస్తాడు. తండ్రిలా ఫెయిల్యూర్ లాయర్ కాలేనని అంటాడు. ఈ క్రమంలోనే నారాయణ చావుకు మీరు కూడా ఒక కారణమేనని పరశురాంని వేద నిందిస్తుంది. దీంతో రియలైజ్ అయిన పరశురాం.. నారాయణ కేసుని టేకప్ చేస్తారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. నారాయణ ఎవరు? నారాయణ తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులను ఆశ్రయించినా ఎందుకు పట్టించుకోలేదు? నారాయణ కూతురు సమీర కిడ్నాప్ వెనుక ఉన్నదెవరు? అసలు సమీర ఏమైంది? వంటి అంశాలను వెబ్‌సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇది ఒక పర్పెక్ట్ కోర్టు రూం డ్రామానే కాదు.. పర్ఫెక్ట్ థ్రిల్లర్. సిరీస్‌ను అద్భుతంగానూ.. ఆసక్తికరంగానూ నడిపించారు. కోర్టు మెట్లక్కనని భీష్మించిన పరుశురాం.. నారాయణ కేసు కోసం కోర్టు మెట్లెక్కడం.. అక్కడ సాధారణంగా సినిమాల్లో కనిపించే బీభత్సమైన వాదనలేమీ లేవు. సింపుల్‌గా.. చాలా డీసెంట్‌గా వాదనలుంటాయి. శ్రీకాంత్ వర్సెస్ ముఖేష్ రుషి మధ్య వాదన జరుగుతుంది. అది కూడా చాలా సాధారణంగా ఉంటుంది. కానీ ఆకట్టుకుంటుంది. ఇక సమీర ఏమైందో తెలుసుకునేందుకు పరశురాం, వేద కలిసి సాగించే ఇన్వెస్టిగేషన్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అసలేం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఒక్కటే కేసు.. ఆ కేసు చుట్టూ జరిగే డ్రామా ఆకట్టుకుంటుంది. చివరి రెండు ఎపిసోడ్స్ మరింత ఎంగేజింగ్‌గా ఉంటుంది. సమీర ఎవరో కనిపెట్టడం.. అసలామెకు ఏం జరిగిందనేది పరశురాం తెలుసుకోవడం.. ఆ తరువాత కోర్టులో పరుశురాం వర్సెస్ విశ్వనాథ్ మధ్య జరిగే వాదోపవాదనలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎండింగ్ కూడా ప్రేక్షకులను చాలా ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది.

ఎవరెలా నటించారంటే..
పరశురాంగా శ్రీకాంత్ తన పాత్రలో ఒదిగిపోయారు. కోర్టులో కానీ.. ఇన్వెస్టిగేషన్ సమయంలో కానీ ఆయన నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వేద పాత్రలో అనన్య శర్మ నటన చాలా బాగుంది. ముకేష్ రుషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది.. తన పాత్రలో జీవించేశారు. సమీర్, జెమిని సురేష్ తదితరులంతా తమ పాత్రలో చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఈ వెబ్‌సిరీస్‌ను చాలా ఆసక్తికరంగా మలిచారు. ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కోర్టు రూం డ్రామా ఆకట్టుకుంది. ఏమాత్రం హడావుడి చేయలేదు. వాదనలన్నీ సింపుల్‌గా, డీసెంట్‌గా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే వెబ్‌సిరీస్‌కు తగినట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగినట్టుగానే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వల్గారిటీ కానీ ఇబ్బందికర డైలాగ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ వెబ్‌సిరీస్‌ను ప్రతి ఒక్కరూ చూడవచ్చు.
ఫైనల్‌గా.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఎంగేజింగ్ కోర్టు రూం డ్రామా
Rating: 



(3/5)
