
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచందర్ రావు ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకే అధ్యక్ష పదవి రావాలని, నాయకత్వ నిర్ణయాలు “నా మనిషి – నీ మనిషి” లాజిక్ మీద కాకుండా, వ్యూహాలపై ఆధారపడాలని ఆయన స్పష్టం చేశారు.
“తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలంటే.. బూత్ స్థాయిలో కష్టపడే కార్యకర్త నాయకుడే ప్రెసిడెంట్ కావాలి. లాయల్టీ కన్నా క్యాడర్ పని చూసి నిర్ణయం తీసుకోవాలి. నా మనిషి, నీ మనిషి అనుకుంటూ పోతే పార్టీ సర్వనాశనం అవుతుంది,” అని రాజాసింగ్ విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో అంతర్గత అసంతృప్తికి సంకేతంగా నిలుస్తున్నాయి. రామచందర్ రావు నియామకంపై మరికొంతమంది నేతలు లోపల తర్జన భర్జనలో ఉన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ఉన్నత నేతలు దీనిపై ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
