Download App
Movie Poster

I, Nobody

Cast: Prithvi Sukumaran, Parvathy Thiruvothu, Vijayaraghavan, Ashokan, Nandhu, Hakkim Shah

Director: Nisam Basheer

Music Director: Jakes Bejoy

Producer: Supriya Menon, Mukesh R. Mehta, CV Sarathi

Release Date: July 10, 2026

ఐ, నోబడీ మూవీ రివ్యూ

Published జూలై 10, 2026 by Srinivas

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా క్రైమ్ బ్యాంక్ హెయిస్ట్ థ్రిల్లర్ ‘ఐ నోబడీ’ (I, Nobody)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ జానర్ చిత్రాలను జాగ్రత్తగా తెరకెక్కించాలే కానీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. బ్యాంక్ క్రైమ్ జానర్‌లో ‘లక్కీ భాస్కర్’ వచ్చి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ చిత్రం కూడా ‘లక్కీ భాస్కర్’ స్థాయిని అందుకుంటుందా? అసలు సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

I, Nobody Movie Review

కథేంటంటే..

రాజీవన్ (ప్రిథ్వీరాజ్ సుకుమారన్) ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. అతనికి ఇద్దరు కుమార్తెలు జియా, అమల. భార్య మీరా (పార్వతి) ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. కానీ భర్తతో ఆమెకు మాటలుండవు. ఇలాం తరుణంలో ఒక భారీ బ్యాంకు దోపిడీ జరుగుతుంది. రాజీవన్ నిర్లక్ష్యం కారణంగా అనుకోకుండా ఈ బ్యాంకు దోపిడీలో అతను ఇరుక్కుంటాడు. దీంతో అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. ఆ అనుమానం అతని జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా తలకిందులు చేసింది అనేదే సినిమా కథ. ఆ సంఘటనల పర్యావసనాలు.. అతడిని వ్యవస్థతో పోరాడే స్థితికి తీసుకొస్తాయి. కనీసం ఆధారాలు లేకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం వార్తలు, రూమర్స్ ప్రసారం చేస్తాయి. అవి కాస్తా రాజీవన్ జీవితంపై దారుణమైన ప్రభావం చూపిస్తాయి. పోలీసులు తరచూ అతని ఇంటికి వస్తుంటారు. మీరా నిజం చెప్పమని ఎంత అడిగినా రాజీవన్ మౌనంగానే ఉంటాడు. అతనికి ఆ దోపిడీతో సంబంధం ఏమిటి? అతను నిజంగా నిర్దోషి అయితే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడు? అనే విషయాలను వెండితెరపై సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

I, Nobody Movie Review

సినిమా ఎలా ఉందంటే..

సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రాజీవన్‌కు ఒక పోలీస్ అధికారి ఫుడ్ చైన్ గురించి కొత్త కోణంలో వివరిస్తాడు. సాధారణంగా మిడతను కప్ప తింటుంది. కానీ ఈ ప్రపంచంలో బతకాలంటే మిడతే కప్పను తినాలి అని చెబుతాడు. ప్రపంచం ఎంత క్రూరంగా మారిందనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ.

‘ఐ, నోబడీ’ ఒక స్లో-బర్న్ హైస్ట్ థ్రిల్లర్. కథ మొదట స్లోగా సాగినా, తర్వాత ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. రాజీవన్ ఒక సాధారణ వ్యక్తిలా కనిపించినా, అతని హావభావాలు, తెలివితేటలు అతనికి ఈ దోపిడీలో కీలక పాత్ర ఉందనిపిస్తూ ఉంటాయి. దర్శకుడు నిస్సామ్ బషీర్ దోపిడీ ఎలా జరిగిందనే దానికంటే, రాజీవన్ మనసులో ఏమి జరుగుతోంది? అతను ఎలా బయటపడాలనుకుంటున్నాడు? అనే అంశాలపై ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా అనిపించింది. రాజీవన్ ఎలాంటి సూపర్ హీరో కాదు. అతను దెబ్బలు తింటాడు, బాధపడతాడు. అయినా తన ఒక్క తప్పు వల్ల భార్యా పిల్లల జీవితం నాశనం కాకూడదనే ఆలోచనతో ముందుకు సాగుతుంటాడు. రచయిత సమీర్ అబ్దుల్ ఎంచుకున్న నాన్-లీనియర్ కథనం ఫస్ట్ హాఫ్‌లో మంచి ఉత్కంఠను సృష్టిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంత నెమ్మదిస్తుంది. ఒక విషయాన్ని చెప్పి, మళ్లీ అదే విషయాన్ని చూపించడం వల్ల కథ అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. చివరి భాగంలో వచ్చే ట్విస్టులు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

I, Nobody Movie Review

ఎవరెలా చేశారంటే..

పృథ్వీరాజ్ సుకుమారన్.. తన పాత్రలో ఒదిగిపోయారు. చాలా హుందాగా కనిపించారు. పార్వతి అయితే తన పాత్రలో జీవించారనే చెప్పాలి. భార్యగా, తల్లిగా, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళగా అద్భుతమైన నటనను కనబరిచింది. భర్త తీసుకున్న నిర్ణయాలు కుటుంబంపై ప్రభావం చూపినప్పుడు అతన్ని నిలదీయడానికి కూడా వెనుకాడదు. ఇక మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

I, Nobody Movie Review

టెక్నికల్ పరంగా..

దర్శకుడు రాజీవన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమే సినిమాకు ప్రధాన బలం. అయితే సెకండాఫ్, ఎండింగ్‌పై కాస్త ఫోకస్ పెట్టి ఉంటే సినిమా అద్భుతంగా ఉండేది. మీరా పాత్రను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ పనితనం సినిమాకు ప్రధాన బలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా లిఫ్ట్ ఫైట్ సీన్, స్లో-మోషన్ ట్రాకింగ్ షాట్లు, నిక్సన్ జార్జ్ అందించిన సౌండ్ డిజైన్ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఎడిటింగ్ మాత్రం చాలా పేలవంగా ఉంది. మంచి కథ, కొత్త తరహా స్క్రీన్‌ప్లే ఉన్నప్పటికీ, చివరి భాగంలో కథ సాగదీయడం వల్ల ప్రేక్షకులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

ఫైనల్‌గా.. విభిన్నమైన హెయిస్ట్ థ్రిల్లర్లు, క్యారెక్టర్-డ్రివెన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇదొక మంచి ఛాయిస్.

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.