రుద్రవనం PS వెబ్ సిరీస్ రివ్యూ
Published అక్టోబర్ 31, 2026 by Srinivas
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లకు ఉన్నంత క్రేజ్ థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలకు కూడా లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్స్‌కు ప్రేక్షకాదరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే జీ5 వేదికగా రుద్రవనం PS అనే క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే…
రుద్రవనం అనే ఒక మారుమూల ఊరిలో పోలీస్ స్టేషన్ కేంద్రంగా నడిచే సిరీస్ ఇది. రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో అక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా శివకుమార్ (నరేష్ అగస్త్య) పని చేస్తుంటాడు. ఆయన తన భార్య డెలివరీ కోసం సెలవు మీద వెళ్లాలి అనుకుంటాడు. ఇంతలోనే ఒక ఫోన్ కాల్ వస్తుంది. రుద్రవరం బోర్డు దగ్గరకు రమ్మని చెబుతాడు. అక్కడకు వెళ్లిన శివకుమార్, ఏఎస్ఐ మాధవ్ (శివ ఆలపాటి)తో కలిసి అక్కడకు వెళతాడు. అక్కడ ఊహించని విధంగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని శవం దొరుకుతుంది. అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుందర్ (రమేష్ కొన్నంబొట్ల)ను కాపలా ఉంచి వెళతారు. కానీ సుందర్ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోవడంతో శవం తల మిస్ అవుతుంది. ఇది పోలీసులకు తలనొప్పిగా తయారవుతుంది. దానికి తోడు స్థానిక ఎమ్మెల్యే (రాజా రవీంద్ర) సోదరుడు చంద్ర కనిపించకుండా పోతాడు. ఈ రెండు వ్యవహారాలు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతాయి. అసలు ఆ శవం ఎవరిది? శవం తల ఎవరు తీసుకెళ్లారు? ఎమ్మెల్యే తమ్ముడు ఏమయ్యాడు?ఈ కేసుల చిక్కుముడులను విప్పే క్రమంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లేంటి? వంటి అంశాలను వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే…
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగే వెబ్ సిరీస్‌లకు స్క్రీన్‌ప్లే అనేది చాలా కీలకం. ఇంట్రస్టింగ్‌గా సాగితేనే కంటిన్యూ చేయగలం. లేదంటే ఒకట్రెండు ఎపిసోడ్‌లతోనే క్లోజ్ చేసేస్తాం. ఈ వెబ్‌సిరీస్ మనకు ఏమీ బోర్ కొట్టించదు. ఒక్కొక్క ఎపిసోడ్ 15 నిమిషాల డ్యురేషన్ మాత్రమే ఉంటుంది. పెద్దగా సాగదీతకు ఛాన్స్ లేకుండా తక్కువ నిడివితో ఇన్వెస్టిగేషన్ పార్ట్‌ను కొనసాగించాడు దర్శకుడు. తొలి రెండు ఎపిసోడ్స్‌లో శవం దొరకడం.. దానికి మొండెం మిస్ అవడం.. ఎమ్మెల్యే తమ్ముడి మిస్సింగ్ వంటి అంశాలతో నడిపించారు. మూడవ సిరీస్ దగ్గరకు వచ్చేసరికి ఎమ్మెల్యే తమ్ముడు ఏమయ్యాడనేది తెలుసుకుంటారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సాగిస్తుండగానే మరో స్టేషన్‌లో సస్పెన్షన్‌లో ఉన్న ఎస్సై వచ్చి కిరణ్ అనే వ్యక్తి మిస్సింగ్ గురించి చెప్పడం.. ఆ తరువాత సాగే ఉత్కంఠభరిత సన్నివేశాలతోనే 5వ ఎపిసోడ్ వరకూ నడిపించారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ముగింపు విషయానికి వస్తే.. కాస్త బలంగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆర ఎపిసోడ్ స్లో నెరేషన్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఐదవ ఎపిసోడ్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఇన్వెస్టిగేషన్ పార్ట్ అసలు విషయాన్ని రివీల్ చేసే సమయానికి తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను బలంగా రాసుకుని ఉండే బాగుండేది. క్రైమ్ వెనుక ఉన్న మోటివ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉండి ఉంటే ఈ సిరీస్ వేరే లెవల్‌లో ఉండేది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఇది బాగానే ఆకట్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే..
పోలీస్ అధికారిగా.. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్‌గా నరేష్ అగస్త్య చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇన్స్‌పెక్టర్‌గా సీనియర్ నటుడు బెనర్జీ చాలా బాగా నటించారు. ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర తన పాత్రలో జీవించారు. శివ ఆలపాటి, సుగాలి సిలోని, శ్రావణి రెడ్డి, రమేష్ కొన్నంభొట్ల తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.
టెక్నికల్ పరంగా..
డైరెక్టర్ శశిధర్ మున్నంగి సిరీస్‌ను ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కానీ ఎండింగ్ విషయంలోనే తడబడినట్టుగా అనిపించింది. స్ట్రాంగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. పవన్ సమకూర్చిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలంగా మారాయి. అక్షర్ అలీ కెమెరా పనితనం, ఎడిటింగ్ కూడా బాగుంది.
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులంతా చూడవచ్చు.
ఫైనల్‌గా రుద్రవనం PS.. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా
Rating: 



(2.75/5)
